హైదరాబాద్‌లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఆకాశహర్మ్యాలు, లగ్జరీ విల్లాలను స్థానికులు కొనడం లేదా? దేశ, విదేశీ నగరాల్లో నివసించేవారే ఎక్కువగా తీసుకుంటున్నారా?
హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాల నిర్మాణం జోరందుకున్న విషయం తెలిసిందే. వీటిని పశ్చిమంలోనే ఎక్కువగా కడుతున్నారు. అయితే, ఇందులో స్థానికులు ఎక్కువగా కొనట్లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్క గుజరాత్ తప్ప.. మిగతా రాష్ట్రాల ప్రజలంతా హైదరాబాద్‌లో ఇళ్లను కొంటున్నారని కొందరు బిల్డర్లు చెబుతున్నారు. ఆయా మెట్రో నగరాల్లో ప్రస్తుతమున్న రేట్ల కంటే.. హైదరాబాద్‌లో ఫ్లాట్ల ధరలింకా తక్కువగా ఉండటమే కారణమని అంటున్నారు. వచ్చే ఐదు నుంచి పదేళ్లలో హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయనే అంశాన్ని గుర్తించి చాలామంది పెట్టుబడిదారులు భాగ్యనగరం వైపు చూస్తున్నారని క్రెడాయ్ హైదరాబాద్ బిల్డర్లు సైతం అంగీకరిస్తున్నారు. బీహారులో పాట్నా వంటి నగరానికి చెందినవారు అక్కడ కొనకుండా భాగ్యనగరంలో తీసుకుంటున్నారని తెలిపారు.
దేశం నాలుగు వైపుల నుంచే కాకుండా.. ప్రవాసులు సైతం హైదరాబాద్‌లో స్థిర పడేందుకు ఆసక్తి చూపిస్తున్నారని పలువురు బిల్డర్లు అంటున్నారు. ఎందుకంటే, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతున్నాయి. తద్వారా ఐటీ కంపెనీలు నగరానికి విచ్చేస్తున్నాయి. భవిష్యత్తులో ఇక్కడ నీటి సరఫరా గురించి ఇబ్బంది ఉండదు. ఇలాంటి పలు అంశాల కారణమని విశ్లేషిస్తున్నారు. మన వద్ద బిల్డర్లు అపార్టుమెంట్లను పూర్తి చేయగానే నీటి కనెక్షన్ సులువుగా లభిస్తుంది. కానీ, బెంగళూరు వంటి నగరంలో నిర్మాణం పూర్తయ్యి ఐదేళ్లయినా మంచినీటి కనెక్షన్ లభించట్లేదని ఒక బిల్డర్ వాపోయారు. ఒకప్పుడు మంజీరా గురించి సమస్య ఉండేది. కానీ, ఆతర్వాత పరిష్కారమైంది. ప్రస్తుతం ప్రజలకు మంచినీటి సరఫరా కూడా జరుగుతోంది. కానీ, కావేరి సమస్య ఇంకా పరిష్కారమే కాలేదు. అభివృద్ధిని ఆకాంక్షించే ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల.. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ.. మౌలికాభివృద్ధిపై దృష్టి సారించడం వల్ల.. దేశ, విదేశీ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఇళ్లను కొంటున్నారని క్రెడాయ్ హైదరాబాద్ సంఘ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.