రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోయే ప్రసక్తే లేదని క్రెడాయ్ హైదరాబాద్ అభిప్రాయపడింది. హైదరాబాద్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచే ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధి చేయాల్సిందేనని తెలిపారు. గతేడాది నగరంలో సుమారు లక్ష యూనిట్లు అమ్ముడయ్యాయని వెల్లడించారు.
ఈ ఏడాది సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. పెరిగే భూముల ధరల కారణంగా పశ్చిమ హైదరాబాద్‌లో ఫ్లాట్ల ధరలు పెరుగుతున్నాయే తప్ప మిగతా ప్రాంతాల్లో ఇళ్ల ధరలు నేటికీ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ధరలు పెరగడమంటే బిల్డర్లకు గొప్పేం కాదు.. అది స్థల యజమానులకు మాత్రమే గర్వమని ప్రధాన కార్యదర్శి జగన్నాథ్ రావు తెలిపారు.
హైదరాబాద్‌లో భూమి కొరత లేనే లేదు. ఎక్కడికెళ్లినా స్థలం లభిస్తుంది. పైగా, నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటైంది. కొత్తగా రీజినల్ రింగ్ రోడ్డును డెవలప్ చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. అయినా, ప్రజలు హైదరాబాద్‌లో ఎందుకు ఇళ్లను కొనలేకపోతున్నారు? భూముల రేట్లు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో డెవలపర్లను ఇళ్లను నిర్మించినా.. అక్కడ ప్రజలు ఫ్లాట్లను కొనడంలో విముఖత చూపిస్తున్నారు. ఎందుకంటే, ఆయా ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరత ఉండటమో ప్రధాన కారణమని చెప్పొచ్చు. నివాసయోగ్యమైన పరిస్థితులు అక్కడ లేకపోవడం మరో కారణంగా అభివర్ణించొచ్చు. అంతేకాదు, హైదరాబాద్ నుంచి శివారు ప్రాంతాలకు అనుసంధానం చేస్తూ పటిష్ఠమైన రవాణా వ్యవస్థ అభివృద్ధి కాలేదని చెప్పొచ్చు.
ఈ కారణం వల్లే అధిక శాతం ప్రజలు శివార్లలో నివసించేందుకు వెనకడుగు వేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్నుంచి పట్టణాలకు, అక్కడ్నుంచి నగరాలకు ప్రజలు విచ్చేస్తారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సమతుల్యతతో అభివృద్ధి మీద దృష్టి సారించే ప్రభుత్వం కావాలని తెలంగాణ బిల్డర్లు కోరుకుంటున్నారు. నిర్మాణ రంగానికి కొనేవారు కావాలి.. ఆ కొనేవారికి అవసరమయ్యే మౌలిక, పౌర సదుపాయాల్ని ప్రభుత్వం కల్పించాలి. అప్పుడే శివార్లకైనా వెళ్లి ప్రజలు సొంతింటిని కొనుక్కుంటారు.
భాగ్యనగరంలో నిర్మాణ రంగం ప్రయోజనాల్ని కాపాడేందుకు కృషి చేస్తామని.. ఈ క్రమంలో ప్రీలాంచుల అమ్మకాల్ని తగ్గించేందుకు కృషి చేస్తామని క్రెడాయ్ హైదరాబాద్ కొత్త సంఘం తెలియజేసింది.
This website uses cookies.