సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. కానీ ఓ ఇంటిని సొంతం చేసుకోవడం మాత్రం అంత సులభం కాదు. ఎన్నో మోసాలు, మరెన్నో అవకతవకలు ఉండే రియల్ పరిశ్రమలో పారదర్శకత కోసం ప్రభుత్వం రెరా చట్టం తీసుకొచ్చింది. దీంతో రియల్ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. మొదటిసారి ఇల్లు కొనాలనుకునేవారి కోసం రెరా కొన్ని మార్గదర్శకాలు తీసుకొచ్చింది. అవేంటో చూద్దామా?
మీరు కొనాలుకుంటున్న ఫ్లాట్ కి సంబంధించిన ప్రాజెక్టు రెరాలో రిజిస్టర్ అయిందో లేదో తనిఖీ చేయాలి. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ప్రకటనలు, బ్రోచర్లపై రెరా నంబరు ఉండాలి. ఆ నెంబరును రెరా వెబ్ సైటులో ధ్రువీకరించుకోవాలి. ఆ తర్వాతే ఏదైనా చెల్లింపులు చేయాలి.
ఫ్లాట్ కార్పెట్ ఏరియా ఎంతో తెలుసుకోవాలి. కార్పెట్ ఏరియా అంటే గోడల లోపల ఉపయోగించతగిన ప్రాంతం అన్నమాట. రెరా మార్గదర్శకాల ప్రకారం ఫ్లాట్ ధర కార్పెట్ ఏరియా ఆధారంగానే ఉండాలి తప్ప.. సూపర్ బిల్టప్ ఏరియా మీద కాదు.
లేఔట్ ప్లాన్, స్పెసిఫికేషన్లు, సౌకర్యాలు.. ఇలా మొత్తం సమాచారం తెలుసుకోవాలి. అదంతా రాతపూర్వకంగా ఉండాలి. దానిపై బిల్డర్, కొనుగోలుదారు సంతకం ఉండాలి.
బిల్డర్ కోట్ చేసిన ధర ఫైనల్ అనేది తెలుసుకోవాలి. ఆ ధర కార్పెట్ ప్రాంతంపైనే ఉండాలి. పార్కింగ్, మెయింటనెన్స్, ఎలక్ట్రిసిటీ వంటి అన్ని చార్జీలూ కలిగి ఉండాలి.
ప్రాజెక్టు కోసం బిల్డర్ ఎస్క్రో ఖాతా కలిగి ఉన్నారో లేదో తెలుసుకోవాలి. కొనుగోలుదారుల నుంచి సేకరించిన సొమ్ములో 70 శాతం ఈ ఖాతాలోనే డిపాజిట్ చేయాలి. ఈ డబ్బును నిర్మాణ, భూమి ఖర్చు కోసం మాత్రమే వినియోగించాలి.
ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తారనేది కచ్చితంగా తెలుసుకోవాలి. ఇందుకోసం బిల్డర్ నిర్దిష్ట కాలక్రమాన్ని అందించాలి. రెరా మార్గదర్శకాల ప్రకారం నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టు పూర్తి కాని పక్షంలో బిల్డర్ జరిమానా చెల్లించాలి.
అప్రూవ్డ్ ప్లాన్ ప్రకారమే బిల్డర్ ప్రాజెక్టు నిర్మిస్తున్నారో లేదో చూసుకోవాలి. మంచి నాణ్యత కలిగన నిర్మాణ సామగ్రిని వినియోగిస్తున్నారో లేదో తెలుసుకోవాలి. నిర్మాణ స్థలం రెరా మార్గదర్శకాల ప్రకారం తగిన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందా అనేది పరిశీలించాలి.
బిల్డర్ లేదా ప్రాజెక్టుకు సంబంధించి ఏమైనా లోపాలుంటే రెరా అథారిటీకి ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం రెరాలో ఫిర్యాదు పరిష్కార యంత్రాంగం ఏర్పాటు చేశారు. ఇది నిర్దిష్ట కాలవ్యవధిలో సమస్యను పరిష్కరిస్తుంది.