Categories: LATEST UPDATES

నెల క్రిత‌మే రెరా ఛైర్మ‌న్ ఎవ‌రో తెలిసిందా?

‘రెరా’ తొలి ఛైర్మన్‌గా సీడీఎంఏ సత్యనారాయణ

  • సభ్యులుగా జన్ను లక్ష్మీనారాయణ, కె. శ్రీనివాసరావు

ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్ రెరా)కి చైర్మన్, సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది టీఎస్ రెరా చైర్మన్ గా పురపాలక శాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ, సభ్యులుగా వాణిజ్య పన్నుల శాఖ విశ్రాంత అదనపు కమిషనర్ జన్ను లక్ష్మీ నారాయణ, టౌన్ ప్లానింగ్ విశ్రాంత డైరెక్టర్ కె.శ్రీనివాసరావు నియమితులయ్యారు. ప్రస్తుతం రెరా ఛైర్ పర్సన్ గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అద‌న‌పు బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తిస్తున్నారు. సుదీర్ఘ కార్యాచరణ అనంతరం ప్రభుత్వం రెరాకు కొత్త చైర్మన్, సభ్యులను నియమించింది. ఇందుకోసం చాలా కసరత్తు చేసింది. అయితే, ఆయ‌న రెరా ఛైర్మ‌న్‌గా ఎంపిక అవుతార‌నే విష‌యం నెల రోజుల క్రిత‌మే రియ‌ల్ వ‌ర్గాల్లో వినిపించింది. సోమేష్ కుమార్ కు రెరా బాధ్య‌త‌ల్ని అంద‌జేస్తార‌ని తొలుత అంద‌రూ భావించారు. కానీ, చివ‌రికీ సౌమ్యుడైన స‌త్య‌నారాయ‌ణ వైపే ప్ర‌భుత్వం మొగ్గు చూపింది.

వాస్తవానికి తెలంగాణ రెరా ఏర్పాటైన త‌ర్వాత రాజేశ్వ‌ర్ తివారీ ఛైర్మ‌న్‌గా అద‌న‌పు బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించారు. ఆయ‌న త‌ర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే ఛైర్మ‌న్‌ గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రెరాకు ఛైర్మ‌న్‌ తో పాటు ఇద్దరు సభ్యులను నియమించేందుకు ఈ ఏడాది జనవరి 16న నోటిఫికేషన్ వచ్చింది. దీంతో ఛైర్మ‌న్‌ పోస్టుకు 37 మంది దరఖాస్తు చేసుకున్నారు. మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, మున్సిపల్ పరిపాలన డైరెక్టర్ ఎన్. సత్యనారాయణ తదితరులు దరఖాస్తు చేసుకున్నవారిలో ఉన్నారు. సభ్యుడి పోస్టుకు 59 దరఖాస్తులు వచ్చాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ.. ఈ పోస్టుల ఎంపిక బాధ్యత చేపట్టింది. అన్ని అంశాలనూ పరిశీలించిన కమిటీ.. ఛైర్మ‌న్‌ పదవికి అర్హులైన నలుగురి పేర్లతోపాటు సభ్యులిగా కొంతమంది పేర్లను ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపించింది. అనంతరం ప్రభుత్వం ఛైర్మ‌న్‌ గా సత్యనారాయణను ఎంపిక చేసింది. పురపాలక శాఖలో ఎంతో అనుభవం ఉన్నందున ఆయన్ను ఈ పదవిలో నియమించినట్టు తెలుస్తోంది.

1996లో కుత్బుల్లాపూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా సత్యనారాయణ ప్రస్థానం మొదలైంది. ఎన్నో ఆవిష్కరణలు, ప్రయోగాలు చేశారు. మున్సిపాలిటీల్లో పేదరికాన్ని తగ్గించే పురపాలక కార్యాచరణ ప్రణాళిక (ఎంఏపీపీ)’ని రూపొందించి అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా, జోనల్‌ కమిషనర్‌గా కూడా విధులు నిర్వర్తించారు. 2009 బ్యాచ్‌ ఐఏఎస్‌గా ఎంపికైన తరువాత నల్లగొండ జాయింట్‌ కలెక్టర్‌గా, ఇన్‌చార్జి కలెక్టర్‌గా, తెలంగాణ ఏర్పాటు తరువాత కామారెడ్డి కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు. మెప్మా ఎండీగా కూడా పని చేశారు. గత మూడేళ్ల ఐదు నెలలుగా సీడీఎంఏగా విధులు నిర్వర్తిస్తున్నారు.

This website uses cookies.