యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన లూలు మాల్ భారతదేశంలో ఆరో మాల్‌ను హైదరాబాద్‌లో ఆరంభిస్తోంది. జేఎన్‌టీయూ సమీపంలోని మంజీరా షాపింగ్‌మాల్‌ను ఈ సంస్థ గతేడాది టేకోవర్ చేసింది. గత కొంతకాలం నుంచి షాపింగ్‌మాల్ రూపురేఖల్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే పని మీద దృష్టి సారించింది.
అంతా సవ్యంగా సాగితే, ఆగస్టు చివరి వారంలో ఈ మాల్‌ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆరంభమయ్యే అవకాశముంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సంస్థ ఛైర్మన్ యూసఫ్ అలీ మాట్లాడుతూ.. లూలు గ్రూప్ హైదరాబాద్‌లో మొదటి లులు మాల్ మరియు లులు హైపర్ మార్కెట్ సిద్ధమవుతోందని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో రూ.500 కోట్లను పెట్టుబడిగా పెడుతున్నామని వెల్లడించారు.
గత ఏడాది దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంతో లూలు గ్రూప్ పలు దఫాలుగా చర్చలను జరిపింది. అనంతరం ఎంవోయూపై సంతకం చేసింది. మొదట రూ.300 కోట్ల పెట్టుబడితో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మంజీరా మాల్‌ను లూలు మాల్‌గా డెవలప్ చేసింది.
హైదరాబాద్ ప్రజలకు అంతర్జాతీయ షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు మంజీరా మాల్‌ను సరికొత్త రీతిలో తీర్చిదిద్దుతోంది. ఈ మాల్‌లో మెగా లులు హైపర్‌మార్కెట్, 75 కంటే ఎక్కువ స్థానిక మరియు అంతర్జాతీయ బ్రాండ్‌లకు స్థానం కల్పిస్తుంది. ఈ మాల్ ద్వారా సుమారు రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. లూలు మాల్ ఇప్పటికే కోచి, తిరువనంతపురం, బెంగళూరు, లక్నో, కోయంబత్తూరులో షాపింగ్ మాళ్లను నిర్వహిస్తోంది.