- గతేడాది 53 శాతం మేర పెరిగిన విక్రయాలు
- మొత్తం 19,700 యూనిట్ల అమ్మకం
దేశంలో లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. విశాలమైన ఇళ్లు, లగ్జరీ సదుపాయాలు కోరుకునేవారి సంఖ్య క్రమంగా ఎక్కువ కావడంతో ఈ నివాసాలకు డిమాండ్ సైతం అదే స్థాయిలో పెరుగుతోంది. 2024లో హైదరాబాద్ సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో రూ. 4 కోట్లకు పైగా ఖరీదు చేసే లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 53 శాతం ఎగిసినట్లు రియల్ ఎస్టేట్ సంస్థ సీబీఆర్‌ఈ తెలిపింది. గతేడాది ఈ తరహా ఇళ్లు మొత్తం 19,700 అమ్ముడైనట్లు వివరించింది. 2023లో ఇవి 12,895గా ఉన్నాయి.
హైదరాబాద్‌లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 2,030 యూనిట్ల నుంచి 70 పెరిగి 2,100 యూనిట్లకు చేరినట్టు నివేదిక తెలిపింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో అత్యధికంగా 10,500 యూనిట్లు అమ్ముడయ్యాయి. ముంబైలో 4,200 యూనిట్ల నుంచి 5,500 యూనిట్లకు పెరగ్గా.. పుణెలో 400 నుంచి 825 చేరాయి. బెంగళూరులో 265 యూనిట్ల నుంచి 50కి తగ్గింది. కోల్‌కతాలో అమ్మకాలు 310 నుంచి 530కి, చెన్నైలో 165 యూనిట్ల నుంచి 275 యూనిట్లకు పెరిగాయి. కొనుగోళ్లకు నెలకొన్న డిమాండ్‌తో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పటిష్టంగా ఉందని, రాబోయే క్వార్టర్లలోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చని సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. మధ్యస్థాయి ప్రాజెక్టుల ఉండే పుణె, చెన్నై తదితర నగరాలు కూడా హై-ఎండ్ ప్రాజెక్టుల వైపు మళ్లుతున్నాయని పేర్కొన్నారు.