హైదరాబాద్ మహా నగర విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రానున్న 25 ఏళ్లు హైదరాబాద్ సిటీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్-2025కు హెచ్‌ఎండీఏ కసరత్తు మొదలెట్టింది. వచ్చే 3 నుంచి 4 నెలల్లో ముసాయిదా విడుదల చేస్తారని సమాచారం. డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ విడుదల తరువాత ఆయా జిల్లాలు, మండల స్థాయిల నుంచి అభ్యంతరాలు, సూచనల్ని స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ మొత్తం సుమారు మూడు నెలల పాటు జరుగుతుంది. హెచ్ఎండీఏ ముసాయిదా మాస్టర్ ప్లాన్-2025లో మార్పులు, చేర్పుల గురించి పరిశీలించిన తర్వాత.. పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్‌ను ఆమోదిస్తూ తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇస్తుంది. 2025 చివరి నుంచి కొత్త మాస్టర్ ప్లాన్ అమల్లోకి వచ్చే అవకాశముందని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఐదు మాస్టర్ ప్లాన్‌లు అమల్లో ఉన్నాయి. పాత మునిసిపాలిటీ, జీహెచ్‌ఎంసీ, ఎయిర్‌పోర్టు అథారిటీ, సైబరాబాద్ డెవలప్‌మెంట్ అథారిటీ, విస్తరిత ప్రాంతాల అభివృద్ధి ప్లాన్ -2023 ఉన్నాయి. ఈ క్రమంలో ఒక్కోసారి ఒక ప్రాంతం రెండు మాస్టర్ ప్లాన్‌లో పరిధిలోకి వస్తుండడంతో రకరకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 2030 మాస్టర్ ప్లాన్‌లో తప్పుల కారణంగా చాలా ప్రాంతాల్లో అభివృద్ధి అనుకున్నంత మేర సాగడం లేదు. ఎన్‌వోసీల కోసం వివిధ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. గూగుల్ మ్యాపులు, స్థానిక రెవెన్యూ మ్యాపులు, గ్రామాల మ్యాపులు, ఎన్‌జీఆర్‌ఐ, నేషనల్ రిమోట్ సెన్సింగ్‌ను తీసుకొని కొత్త సాంకేతిక విధానంతో తప్పులకు ఆస్కారం లేకుండా కొత్త మాస్టర్ ప్లాన్ ను రూపొందించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇక నుంచి ఒకటే మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా ఆయా స్థానిక సంస్థలు, ఇతర అథారిటీలు తమ ప్రణాళికలకు రూపకల్పన చేయనున్నాయి.
హైదరాబాద్ మహానగరం ప్రణాళిక -2030 లో ఏడు జిల్లాల పరిధి మాత్రమే ఉండగా.. కొత్త మాస్టర్ ప్లాన్ ప్రాంతీయ రింగు రోడ్డు దాటి విస్తరించనున్నారు. కొత్తగా 4 జిల్లాలు, 32 మండలాలు హెచ్‌ఎండీఏలో చేరనున్నాయి. హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేటతో పాటు కొత్తగా నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వికారాబాద్ పలు మండలాలను చేర్చనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 74 మండలాలు ఉండగా వాటి సంఖ్య వంద దాటనుందని సమాచారం. ప్రస్తుతం 7,257 చదరవు కిలోమీటర్ల కంటే విస్తీర్ణం ఉండగా.. దాదాపు 13 వేల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించే అవకాశముంది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న 3600 చెరువులు ఆక్రమణలకు గురి కాకుండా బ్లూ అండ్ గ్రీన్ పేరుతో ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తారు.
This website uses cookies.