హైదరాబాద్ రియల్ రంగాన్ని క్షుణ్నంగా గమనిస్తే.. మెట్రో రైలు ఆరంభమయ్యాకే మియాపూర్, ఉప్పల్, ఎల్‌బీనగర్, నాగోలు వంటి ప్రాంతాల్లో ఫ్లాట్ల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చేశాయి. ఈ అంశాన్ని అర్థం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ, సీఎం రేవంత్‌రెడ్డి మెట్రో రైలు ఏర్పాటుకు సంబంధించి స్పష్టతనిచ్చారు. తమ ప్రభుత్వం మెట్రో రైలు నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తుందనే సంకేతాల్ని రియల్ మార్కెట్‌కి పంపించారు. కాకపోతే, ప్రధాన ప్రాంతాల్ని కలుపుతూ మెట్రో నిర్మాణ జరగాలని.. అందుకు తగ్గ ప్రతిపాదనల్ని సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. దీంతో, హైదరాబాద్ రియల్ మార్కెట్లో కాస్త సానుకూల వాతావరణం ఏర్పడింది.
కొత్త సీఎం కాస్త తెలివిగా ఆలోచించారు. మెట్రో నిర్మాణాన్ని కేవలం హెచ్ఎంఆర్ఎల్ మీద వేయకుండా.. హెచ్ఎండీఏ కమిషనర్‌తో సమన్వయం చేసుకుని కొత్త ప్రతిపాదనల్ని సిద్ధం చేయమన్నారు. నగరంలోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ వెళ్లేలా మెట్రోరైలు నిర్మాణం జరగాలన్నీరు. హైదరాబాద్ మెట్రోరైలు రెండోదశ, మూడవ దశ విస్తరణ, నిర్మాణంపై స్పష్టతనిచ్చారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగర అవసరాలకు తీర్చడానికి సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని , ఓఆర్ఆర్ చుట్టు చిన్నాభిన్నమైన ప్రాంతాలను గ్రోత్ హబ్ గా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. శ్రీశైలం హైవేపై ఏయిర్ పోర్టు ప్రాంతం నుండి కందుకూరు వరకు మెట్రోరైలు కనెక్టివిటీని కూడా ప్లాన్ చేయాలని సూచించారు. ఇక్కడ ఫార్మా సిటీ కోసం భూములను ఈ ప్రాంతంలో సేకరించడం జరిగిందని అన్నారు. అందువల్లే మెట్రో కనెక్టివిటి అవసరమని అన్నారు. జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి శామిర్ పేట్ వరకు, కండ్లకోయ/మేడ్చల్ వరకు మెట్రోరైలు మూడవ దశ విస్తరణ జరగాలని ఆకాంక్షించారు.
విజయవాడ హైవే మీద గల తారామతిపేట నుంచి పశ్చిమ హైదరాబాద్‌లోని నార్సింగి దాకా మెట్రో రైలును ఏర్పాటు చేసే ప్రతిపాదనల్ని సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. మూసీ రివర్ ఫ్రంట్ కారిడార్‌లో భాగంగా ఈస్ట్ మరియు వెస్ట్ కారిడార్‌ను అనుసంధానం చేస్తూ ప్రణాళికల్ని సిద్ధం చేయాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్, మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డిలకు ఆదేశాలను జారీ చేశారు. నాగోల్, ఎంజీబీఎస్ మీదుగా ఈ రూటును ఏర్పాటు చేయమన్నారు. మరి, ఈ మెట్రోను ఎప్పుడు ఆరంభిస్తారో తెలియదు కానీ.. ఇంతవరకూ కాస్త స్తబ్దుగా ఉన్న పెద్ద అంబర్‌పేట్ నుంచి చౌటుప్పల్ దాకా ప్లాట్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరుగుతుంది. ఇక రియల్టర్లు రంగంలోకి దిగి.. అదిగో అక్కడే మెట్రో.. అంటూ మూడు పూవులు ఆరు కాయలుగా ప్లాట్లను అమ్ముకుంటారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.
ఇవీ ప్రతిపాదనలు.. (బాక్స్)
This website uses cookies.