Categories: TOP STORIES

మూసీ చుట్టూ మెట్రో..!

హైదరాబాద్ మహానగరాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. మూసీ నదిని ప్రక్షాళన చేసి సుందరీకరించాలని ఇప్పటికే నిర్ణయించిన రేవంత్ సర్కార్.. మూసీ పొడవునా మెట్రో రైల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తోంద‌ని స‌మాచారం. మూసీకి ఇరువైపులా రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లతో పాటు మెట్రో రైలు నిర్మిస్తే హైదరాబాద్ రూపరేఖలే మారిపోతాయని ప్రభుత్వం భావిస్తోంది.

మూసీ రివర్ డెవలప్‌మెంట్ కోసం డీపీఆర్ సిద్ధం చేసే పనిలో పడ్డ అధికారులు.. మూసీలో నార్సింగి నుంచి నాగోల్ వరకు ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలో మూసీ నదిలోకి వచ్చిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు గుర్తించారు. అలాంటి ఇళ్లకు మార్కింగ్ ఇచ్చారు. తర్వాత వారికి డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయింపు చేశారు. దాంతో కొద్ది మంది డబుల్ బెడ్ రూం ఇళ్లకు షిఫ్ట్ అయ్యారు. మరికొన్ని ప్రాంతాల్లో తమ జీవనోపాధి దెబ్బతింటుందని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వారందరినీ ఆదుకునేలా నిధుల్ని కేటాయించింది. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న సుమారు 15 వేల కుటుంబాల్ని ఆదుకోవాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. ప్రతీ కుటుంబానికి 25 వేల రూపాయలు చెల్లించాలని నిర్ణయించారు. 37 కోట్ల రూపాయలను మూడు జిల్లాల కలెక్టర్లకు బదిలీ చేయాలని డిసైడ్ చేశారు.

మూసీ నదిలో అభివృద్ధి పనులను దశల వారీగా చేపట్టాలని ప్లాన్ చేశారు. ఈ క్ర‌మంలో లంగర్ హౌజ్ బాపూఘాట్ ప్రాంతాల్లో మొదటి దశలో అభివృద్ధి పనులను చేపడ‌తారు. ఈ ప్రాంతంలో మూసీ పరిసరాలు ఖాళీగా ఉండటం, ఎక్కువ స్థలం అందుబాటులో ఉండటం బ్యూటీఫికేషన్ పనులు వేగంగా చేయొచ్చని, మూసీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు గతంలో కేటాయించిన 15 వందల కోట్లు అందుబాటులో ఉండటంతో రైటాఫ్ వే అందుబాటులో ఉన్న ప్రతీ ప్రాంతంలో డెవలప్‌మెంట్ చేయడమే లక్ష్యంగా అధికారులు ముందుకు వెళుతున్నారు.
మూసీని ప్రక్షాళన చేసి సుందరీకరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా గోదావరి నదీ జలాలను తరలించి మూసీలో పారించాలని ప్రణాళికలు సిద్దం చేసింది. మూసీ నదీ కారిడార్‌ వెంట రోడ్‌ కమ్‌ మెట్రో రైలు మార్గం ఏర్పాటు చేయాలనేది సర్కారు ఆలోచనగా తెలుస్తోంది. ఇందులో భాగంగా నది వెంట మెట్రో రైలు నిర్మాణానికి 9 వేల కోట్ల వరకు వ్యయమవుతుందని ప్రాథమికంగా మెట్రో రైలు అధికారులు అంచనా వేశారు. 55 కిలోమీటర్ల దూరంలో 25 కిలోమీటర్ల వరకు భూమార్గంగా వెళ్లేందుకు అవకాశముందని ప్రభుత్వానికి తెలిపారు. అధ్యయనం చేసిన తర్వాతే.. సాధ్యాసాధ్యాలపై స్పష్టత వస్తుందంటున్నారు. హైదరాబాద్‌లో నార్సింగి వద్ద ఓఆర్‌ఆర్‌ నుంచి మొదలు బాపూఘాట్‌, హైకోర్టు, చాదర్‌ఘాట్‌, నాగోలు వైపు నుంచి తూర్పు హైదరాబాద్‌లోని ఓఆర్‌ఆర్‌ వరకు మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ను ప్రతిపాదిస్తున్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు ఒకవైపు నుంచి రెండో వైపు రావాలంటే దాదాపు 80 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. అదే పట్టణం లోపలి నుంచి రహదారి ఉంటే.. రాకపోకల దూరం తగ్గుతుందని కొత్త మార్గాన్ని ప్రతిపాదించారు. ఈ మేరకు మెట్రో రైలు మార్గం నిర్మించాలనేది సర్కారు ఆలోచనగా తెలుస్తోంది. ఈ మార్గంలో, నాగోల్‌ తర్వాత కొంత దూరం భూమార్గం మీదుగా మెట్రో తీసుకెళ్లవచ్చు అనే ఆలోచనను హెచ్‌ఎంఆర్ఎల్‌ ప్రభుత్వం ముందుంచింది. ఎత్తుగా ఉన్న చోట ఈ తరహాలో ఏర్పాటు చేయవచ్చు అనే సూచనలు చేసింది. నిర్మాణ వ్యయాన్ని తగ్గించేందుకు అవకాశం ఉన్న మార్గాలను అధ్యయనం చేస్తోంది. మూసీ పరిసరాల్లో పార్కులు, హోటల్స్, మల్టీ ప్లెక్సులు, షాపింగ్ మాల్స్ వంటివి ఏర్పాటు చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.

This website uses cookies.