కింగ్ జాన్సన్ కొయ్యడ : మియాపూర్ నుంచి హైటెక్ సిటీ వెళ్లాలంటే.. చౌరస్తా నుంచి కుడివైపు వెళితే ఆల్విన్ కాలనీ చౌరస్తా మీదుగా వెళ్లాలి. లేదంటే ఎడమవైపు నుంచి హైదర్ నగర్, జేఎన్టీయూ మీదుగా మాదాపూర్, గచ్చిబౌలి వెళ్లక తప్పదు. కాకపోతే, మియాపూర్ నుంచి నేరుగా హఫీజ్ పేట్ వెళ్లేందుకు 150 అడుగుల రోడ్డును హుడా మాస్టర్ ప్లాన్ 2020లో పొందుపర్చిన విషయం చాలామందికి తెలియకపోవడం ఆశ్చర్యం. మరి, ఏయే అదృశ్య శక్తుల వల్ల ఆ మాస్టర్ ప్లాన్ రహదారి అందుబాటులోకి రాలేదో తెలియదు కానీ.. కొన్నేళ్ల నుంచి మియాపూర్ నుంచి హైటెక్ సిటీ వెళ్లడానికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అటు ఆల్విన్ చౌరస్తా మీద ఇటు జేఎన్టీయూ క్రాస్ రోడ్స్ మీద ట్రాఫిక్ ఒత్తిడి పెరగడానికి ప్రధాన కారణమిదేనని నిపుణులు అంటున్నారు. ఇంత స్పష్టమైన రీతిలో మాస్టర్ ప్లాన్ రోడ్డు ఉండగా.. ఈ రహదారిని ఎందుకు అభివృద్ధి చేయలేదో పాలకులకే తెలియాలి.
మియాపూర్ చౌరస్తా నుంచి నేరుగా హఫీజ్ పేట్ మీదుగా రాకపోకల్ని సాగిస్తే.. హైటెక్ సిటీకి వెళ్లేందుకు సుమారు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. నేరుగా ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ కి కూడా సులువుగా చేరుకోవచ్చు. పైగా, మంజీరా పైన్ లైన్ రోడ్డు మీదుగా కొత్తగా వేసిన కైత్లాపూర్ ఫ్లైఓవర్ వరకూ సులభంగా వెళ్లిపోవచ్చు. మరి, ప్రజలకు ఉపయోగపడే విధంగా, హుడా 2020 మాస్టర్ ప్లాన్లో ఈ రహదారిని పొందుపర్చినప్పటికీ, కార్యరూపం దాల్చలేదు.
ఇప్పటికే మియాపూర్ నుంచి కోకా కోలా జంక్షన్ దాకా.. మెయిన్ రోడ్డు మీదతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పదికంటే ఎక్కువ గేటెడ్ కమ్యూనిటీలు నిర్మితమవుతున్నాయి. దీంతో, రానున్న రోజుల్లో ట్రాఫిక్ మరింత పెరిగి జీవితం నరకప్రాయం అవుతుంది. ఇప్పటికే కోకా కోలా జంక్షన్ నుంచి మియాపూర్ వరకూ ప్రయాణించడానికి కొన్ని సందర్భాల్లో అరగంట కంటే ఎక్కువే సమయం పడుతుంది. ఈ కట్టడాల్లో ప్రజలు నివసిస్తే.. ట్రాఫిక్ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. పైగా, మియాపూర్ మెట్రో చుట్టుపక్కల ప్రాంతాల్లో గల భూముల్లో కూడా అతిత్వరలో కొత్త నిర్మాణాలొచ్చే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి, పెరిగే ట్రాఫిక్ ను పరిగణనలోకి తీసుకుని.. హుడా 2020 మాస్టర్ ప్లాన్లో పొందుపర్చిన మియాపూర్ చౌరస్తా నుంచి హఫీజ్ పేట్ రహదారిని వెంటనే అధికారులు అందుబాటులోకి తేవాలి.
ప్రస్తుతం గూగుల్ మ్యాపును క్షుణ్నంగా గమనిస్తే.. మియాపూర్ చౌరస్తాలో ప్రస్తుతమున్న ట్రాఫిక్ పోలీసు స్టేషన్ వెనక వైపు నుంచి ఒక లేఅవుట్లో వంద అడుగుల రోడ్డును వదిలివేశారు. అంటే, ఈ ట్రాఫిక్ స్టేషన్ ను తొలగించి వంద అడుగుల రోడ్డును వేస్తే సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. పైగా అది వాణిజ్య రహదారిగా అభివృద్ధి చెందుతుంది. మియాపూర్ నుంచి హఫీజ్ పేట్ మాస్టర్ ప్లాన్ రోడ్డులో ఉన్న రెండు చెరువుల మీదుగా కొత్తగా లింకు రోడ్డును వేస్తే ప్రజలకెంతో మేలు కలిగినట్లే. మియాపూర్ క్రాస్ రోడ్స్, ఆల్విన్ కాలనీ చౌరస్తాల మీద ఒత్తిడి ఎంతో తగ్గుతుంది.
కాబట్టి, ఈ అంశంపై మంత్రి కేటీఆర్ దృష్టి సారించాలి. ఉమ్మడి ప్రభుత్వంలో జరిగిన ఈ తప్పిదాన్ని ఇప్పటికైనా సరిదిద్దాలి. లాక్ డౌన్ కాలంలో అనేక కొత్త లింకు రోడ్లను వేసి ప్రజల మన్ననల్ని పొందిన జీహెచ్ఎంసీ.. ఈ 150 అడుగుల హుడా మాస్టర్ ప్లాన్ రోడ్డును వెంటనే అభివృద్ధి చేయాలి. రెండు దశాబ్దాల క్రితం హఫీజ్ పేట్ ఫ్లై ఓవర్ వేశాక ప్రజలకెంతో ఉపశమనం కలిగింది. ఇప్పుడు కూడా హఫీజ్ పేట్ నుంచి మియాపూర్ దాకా నేరుగా వెళ్లేందుకు మాస్టర్ ప్లాన్ రహదారిని అభివృద్ధి చేయాలి.
This website uses cookies.