భారత క్రికెట్ జట్టు మాజీ సారథి ఎంఎస్ ధోని మరిన్ని చిక్కుల్లో పడ్డారు. వివాదాస్పద ఆమ్రపాలి గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన ఆయనపై పలువురు కొనుగోలుదారులు ఢిల్లీ ఆర్థిక నేరాల పోలీసు విభాగానికి ఫిర్యాదులు చేయడంతో ధోనిపై మరో 7 కేసులు నమోదయ్యాయి. ఆమ్రపాలి గ్రూప్ తరఫున ధోని చేసిన ప్రచారానికి ఆకర్షితులయ్యే తాము అందులో ఇళ్లు కొనుగోలు చేసి మోసపోయిన వారు ఆరోపించారు. ఇళ్ల కొనుగోలు కోసం చెల్లించిన డబ్బును ఆమ్రపాలి సంస్థ అక్రమంగా పలు ఇతర కంపెనీల్లోకి మళ్లించిందంటూ జూలై 23న సుప్రీంకోర్టు నిర్ధారించింది.
ఆ కంపెనీల్లో ధోని భార్యకు చెందినవి కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్రపాలి కుట్రలో ధోని కూడా భాగస్వామేనని, అందువల్ల ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు నమోదు చేయాలని తమ తమ ఫిర్యాదుల్లో కోరారు. అనిల్ కె శర్మ సీఎండీగా ఉన్న ఆమ్రపాలి గ్రూప్ కీలకమైన రియల్ ఎస్టేట్ సంస్థగా అవతరించింది. అయితే, కొనుగోలుదారుల నుంచి డబ్బులు తీసుకుని కూడా వారికి ఫ్లాట్లు ఇవ్వకపోవడంతో 2017లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అనంతరం సుప్రీంకోర్టు నియమించిన ఆడిటర్లు విచారణ జరిపి అవకతవకలను నిర్ధారించారు. కొనుగోలుదారుల నుంచి తీసుకున్న కోట్లాది రూపాయలను రియల్ ఎస్టేట్ కార్యకలాపాల కోసం కాకుండా ఇతరత్రా వినియోగించినట్టు నిర్ధారించారు. దీంతో సుప్రీంకోర్టు జూలై 23న తీర్పు వెలువరించింది. సీఎండీగా అనిల్ కె శర్మను తొలగించడంతోపాటు కోర్టు రిసీవర్ కంపెనీని టేకోవర్ చేసి పూర్తి కాని ఫ్లాట్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించింది.
This website uses cookies.