రెరా అనుమతి తీసుకోకముందే.. రేటు తక్కువంటూ.. ప్రీలాంచ్‌లో విల్లాల్ని విక్రయించే సంస్థల జాబితాలోకి ఎంఎస్ ప్రాజెక్ట్స్ సంస్థ చేరింది. ఈ సంస్థ లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లాలను నందిగామలో నిర్మిస్తున్నట్లు.. ప్రీలాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ.1.70 కోట్లకే అందజేస్తున్నామని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఈ ప్రకటనపై హెచ్ఎండీఏ కానీ రెరా లోగో కానీ లేదు కాబట్టి.. వీటి అనుమతి రాలేదని అర్థమవుతోంది. అయితే, ఇలాంటి సంస్థల్లో విల్లాలను కొనేవారెవ్వరైనా.. ఒకటికి రెండుసార్లు ఆలోచించి తుది నిర్ణయానికి రావాలి. ఆకర్షణీయమైన ప్రకటనల్ని చూసి మోసోపోకుండా.. అసలా సంస్థకు ప్రాజెక్టును పూర్తి చేయడంలో ఎంత చిత్తశుద్ధి ఉందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.
ఎంఎస్ ప్రాజెక్ట్స్.. ఎందుకీ ప్రీలాంచ్ మాయ
కొందరు ప్రమోటర్లు ఎలా ఉంటారంటే.. ప్రీలాంచ్‌లో సొమ్ము తీసుకునేవరకూ ఎంతో తీయగా మాట్లాడతారు. మాయమాటలు చెబుతారు. కానీ, ప్రాజెక్టు ఆలస్యమయ్యేటప్పుడు కొనుగోలుదారులు ప్రశ్నించడాన్ని అస్సలు భరించలేరు. కొన్నవారికి వాళ్లేదో మెహర్బానీ చేస్తున్నట్లు భావిస్తారు. మన కష్టార్జితాన్ని ప్రీలాంచ్ ప్రమోటర్ల చేతిలో పోసి చింతించుకుంటూ కూర్చోవడం కంటే.. రెరా అనుమతి గల ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టడమే అన్నివిధాల శ్రేయస్కరం. ఆయా నిర్మాణాల రేటు ఎక్కువన్నప్పటికీ.. సొంతింటి ఆనందాన్ని ఆస్వాదించే వీలుంటుందనే విషయాన్ని మర్చిపోవద్దు.