కింగ్ జాన్సన్ కొయ్యడ : వారంతా బిల్డర్లు, డెవలపర్లే.. ఇందులో కొత్త, పాత అనే తేడా లేదు.. కొందరు చెప్పేవన్నీ మాయమాటలే. ఇరవై లక్షలకే ఫ్లాటు.. ముప్పయ్ లక్షలకే ఇల్లు అంటూ బుట్టలో వేసుకుంటున్నారు. ఏజెంట్ల (రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ల)కు సుమారు ఆరు నుంచి పది శాతం కమిషన్ ఇచ్చి అమాయక కొనుగోలుదారుల్నుంచి వంద శాతం సొమ్మును దండుకుంటున్నారు. దశాబ్దం క్రితం ఢిల్లీ – ఎన్‌సీఆర్‌లో నెలకొన్న పరిస్థితులే ప్రస్తుతం హైదరాబాద్‌లో నెలకొంటున్నాయి. డెవలపర్లకు, కొనుగోలుదారులకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేకుండా.. కేవలం కన్సల్టెంట్ల ద్వారా ఫ్లాట్లను విక్రయించే విష సంస్కృతికి భాగ్యనగరంలోనూ బీజం పడింది. ఇదే కొనసాగితే.. హైదరాబాద్ నిర్మాణ రంగం కోలుకోలేనంత దారుణంగా దెబ్బతినే ప్రమాదముంది. కాబట్టి, ఇప్పటికైనా విలువలతో కూడిన వ్యాపారం చేస్తేనే నిర్మాణ రంగంలో రాణిస్తారు. లేకపోతే, నొయిడా, గుర్గావ్ డెవలపర్ల తరహాలో జైలులో ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. కోర్టుల చుట్టూ తిరగాల్సి రావొచ్చు.
కొన్నాళ్ల క్రితం.. గుర్గావ్, నొయిడాలో కొందరు డెవలపర్లు ఛానల్ పార్టనర్లకు ఆరు నుంచి పది శాతం కమిషన్ అందజేసి ఫ్లాట్లను విక్రయించారు. ఎంచక్కా కన్సల్టెంట్లు సొమ్ము చేసుకున్నారు. స్థల యజమానికి డబ్బులు బాగానే ముట్టాయి. కానీ, డెవలపర్లు మాత్రం అడ్డంగా ఇరుక్కుపోయారు. సకాలంలో కొనుగోలుదారులకు ఫ్లాట్లను అందించడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఇళ్ల కొనుగోలుదారులకు శఠగోపం పెట్టడంతో కొందరు డెవలపర్లు ఊచలు లక్కపెట్టారు. మరికొందరు నేటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కాసులకు కక్కుర్తి పడి.. కొన్నేళ్ల పాటు కష్టపడి సంపాదించిన మంచిపేరును మొత్తం నాశనం చేసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నిర్మాణ రంగంలో కొందరు బిల్డర్లు ఢిల్లీ-ఎన్‌సీఆర్ డెవలపర్ల అడుగుజాడల్లో నడుస్తున్నారా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది.
రెరా అనుమతి తీసుకోకుండా హైదరాబాద్‌లో ఒక డెవలపర్ 120 ఫ్లాట్లను విక్రయించాడు. ఎలా అమ్మగలిగాడంటే.. ఛానల్ పార్టనర్లకు ఆరు శాతం కమిషన్ ముట్టజెప్పాడు. మరి, అంతంత శాతం కమిషన్ ఇచ్చి నిర్మాణాలు చేపడితే వ్యాపారం వర్కవుట్ అవుతుందా? అంటే సరైన సమాధానం లేదు. అందుకే, కొందరు ప్రొఫెషనల్ బిల్డర్లు ఛానల్ పార్టనర్ల మీద ఆధారపడకుండా.. వారికి అంత శాతం కమిషన్లు ఇస్తే వర్కవుట్ అవ్వదన్న ఉద్దేశ్యంతో.. సొంతంగానే అమ్మకాల్ని నిర్వహిస్తున్నారు. మరి సమస్య ఎక్కడొస్తుందంటే? యూడీఎస్, ప్రీ లాంచుల ద్వారా ప్లాట్లు, ఫ్లాట్లను విక్రయిస్తున్న సంస్థలతోనే!
This website uses cookies.