హైదరాబాద్ నగరానికి చెందిన లహరి గ్రూప్ ఎండీ జి.హరిబాబు నరెడ్కో జాతీయ సంఘానికి అధ్యక్షుడి (ప్రెసిడెంట్- ఎలక్ట్)గా ఎన్నికయ్యారు. ఆయన సెప్టెంబరు లేదా అక్టోబరు నుంచి పూర్తి స్థాయి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఆయన ఈ పదవిలో దాదాపు రెండేళ్ల పాటు ఉంటారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా వ్యవహరించారు.కేంద్ర ప్రభుత్వంలోని గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సంఘానికి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చీఫ్ ప్యాట్రన్‌గా వ్యవహరిస్తారు. దేశీయ నిర్మాణ రంగానికి సంబంధించిన అన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, సంఘాలతో కలిసి ఈ సంస్థ పని చేస్తుంది. భారత రియల్ రంగానికి సంబంధించిన విధివిధానాల రూపకల్పనలో ముఖ్యభూమిక పోషిస్తుంది.
నరెడ్కో ప్రత్యేకత ఇదే
ఈ సంఘం కేంద్ర ప్రభుత్వంలోని గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1998లో ఏర్పాటైంది. ఇది భారతదేశంలోని రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన ప్రముఖ పరిశ్రమ సంఘం. ప్రభుత్వం, రియల్ ఎస్టేట్ పరిశ్రమ మరియు సాధారణ ప్రజానీకానికి వారి సమస్యలను పరిష్కరించడానికి మరియు రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లకు సమర్థవంతమైన పరిష్కారాలను కనుగొనడానికి చట్టబద్ధమైన వేదికను అందించడం దీని ప్రాథమిక లక్ష్యం. వివిధ రాష్ట్రాల్లోని నరెడ్కో సంఘాలతో కలిసి సుమారు ఐదు వేల మంది సభ్యులు గల ఈ సంఘం.. వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు పరిశ్రమకు సంబంధించిన తమ అభిప్రాయాల్ని తెలియజేస్తుంది. తద్వార విధానపరమైన రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుంది.