Naredco Telangana Met Telangana Deputy CM Mallu Bhatti Vikramarka and gave representation to resolve few issues related to Telangana Realty
టీఎస్‌బీపాస్ కింద చేసిన దరఖాస్తులు గత రెండేళ్ల నుంచి పెండింగులో ఉన్నాయని.. ఫలితంగా అనేక ప్రాజెక్టులు రంగారెడ్డి జిల్లాలో నిలిచిపోయాయని నరెడ్కె బృందం ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చింది. సోమవారం సచివాలయంలో ఆయన్న కలిసిన బృంద సభ్యులు పలు సమస్యల్ని ఆయనకు విన్నవించారు. రాష్ట్రంలో గత ఆరు నెలల నుంచి కనిపించని పర్యావరణ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. భవన నిర్మాణాలకు తీసుకుంటున్న తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లకు యూనిట్ కు రూ.9 నుండి 14 రూపాయలకు పెంచిన రేటును వెంటనే తగ్గించాలని కోరారు. రెరా ఏర్పాటు కావడంతో భవన నిర్మాణాల అనుమతి సమయంలో తీసుకునే పది శాతం మార్టిగేజ్ విధానాన్ని ఎత్తివేయాలని అభ్యర్థించారు. రాష్ట్రంలో అధికంగా ఉన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించాలని,
జీ.ఓ. 50ను ఎత్తి వేయాలని సూచించారు. పెండింగులో ఉన్న లక్షలాది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్ని వెంటనే పరిష్కరించాలని, తద్వారా పెద్ద ఎత్తున నిర్మాణాలు ప్రారంభమై ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
* అంతకంటే ముందు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. రాష్ట్ర ఖజానాకు పెద్ద ఎత్తున ఆదాయాన్ని తెచ్చి పెట్టే వెల్త్ క్రియేటర్లను ఇబ్బంది పెట్టమని, వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని తీర్చేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. థేమ్స్ నది మాదిరిగా మూసీ నాదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించామని, రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం వల్ల హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మూసీ నది శుద్దితో సుందరీకరణ జరిగి, పర్యాటకం అభివృద్ధి చెందుతుందని, మరిన్ని ఫుడ్ కోర్టులు,ఎంటర్టైన్ మెంట్ ఈవెంట్లు జరిగే అవకాశం ఉందని తద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ ప్రధాన శక్తి గా మారుతుందని తెలిపారు.
* హైదరాబాద్ నగరాన్ని కాలుష్యరహిత నగరంగా మార్చడానికి శివారు ప్రాంతాల్లో ఇండస్ట్రియల్, ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని వివరించారు. ధరణి పై తగు సూచనలు, సలహాలను అందచేస్తే తాను పరిశీలించడంతో పాటు ధరణి పై ఏర్పాటు చేసిన కమిటీకి అందిస్తానని భట్టి విక్రమార్క తెలిపారు. డబ్బులు కట్టి గత రెండు మూడేళ్ళుగా పెండింగ్ లో ఉన్న ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తుల్ని పరిష్కరించే విషయంలో ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రిని కలిసిన వారిలో నరెడ్కో తెలంగాణా విభాగం ప్రతినిధులు మేకా విజయ సాయి,కె. శ్రీధర్ రెడ్డి, కాళీ ప్రసాద్, దశరథ్ రెడ్డి, చలపతి రావు, భూపాల్ రెడ్డి, మారోజు శ్రీధర్ రావు, అశోక్, రాంరెడ్డి వెంకట్ రెడ్డి, కె.కె.రెడ్డి తదితరులు ఉన్నారు.
This website uses cookies.