- గ్రీన్ బెల్ట్ భూమిని ఇతరత్ర అవసరాలకు వాడొద్దు
- జాతీయ హరిత ట్రిబ్యునల్ స్పష్టీకరణ
గ్రీన్ బెల్ట్ కోసం రిజర్వ్ చేసిన భూమిలో ఎలాంటి నిర్మాణాలూ చేపట్టడానికి వీల్లేదని, ప్రభుత్వానికైనా, ప్రైవేటు యజమానులకైనా ఇదే వర్తిస్తుందని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్పష్టం చేసింది. నీటి వనరులను సంరక్షించాల్సిన బాధ్యత చట్టబద్ధ సంస్థలకు ఉందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు జస్టిస్ సుధీర్ అగర్వాల్, విషయ నిపుణుడు డాక్టర్ నాగిన్ నందాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. యూపీ ఝాన్సీకి సంబంధించి 2021 మాస్టర్ ప్లాన్ లో గ్రీన్ బెల్ట్ గా ప్రకటించిన లక్ష్మీ తాళ్, సమీప ప్రాంతాల రక్షణకు చట్టబద్ధ సంస్థలు ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదంటూ దాఖలైన పిటిషన్ విచారించిన సందర్భంగా ట్రిబ్యునల్ ఈ వ్యాఖ్యలు చేసింది.
‘మాస్టర్ ప్లాన్ లో ఓ భూమిని గ్రీన్ బెల్ట్ లేదా గ్రీన్ పార్క్ కోసం రిజర్వు చేసినప్పుడు, అది ప్రభుత్వానిదైనా లేక ప్రైవేటుదైనా.. ఎట్టిపరిస్థితుల్లోనూ అక్కడ నిర్మాణాలకు అనుమతి ఇవ్వకూడదు’ అని పేర్కొంది. గ్రీన్ బెల్ట్ కోసం కేటాయించిన ప్రాంతాలను నివాస లేదా వాణిజ్యపర ప్రాంతాలుగా మార్చకూడదని స్పష్టంచేసింది. ప్రస్తుత వ్యవహారంలో అధికార యంత్రాంగం సరైన చర్యలు తీసుకున్నట్టు కనపడటంలేదని అసంతృప్తి వ్యక్తంచేసింది.
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని పరిశీలించి నివేదిక అందజేసేందుకు అటవీ, పర్యావరణ శాఖతోపాటు వ్యవసాయ, ఝాన్సీ డివిజనల్ కమిషనర్ లతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. రెండు నెలల్లోగా అక్కడి పరిస్థితిపై నివేదిక అందజేయాలని ఆదేశించింది. అలాగే తదుపరి విచారణకు ఝాన్సీ మున్సిపల్ కమిషనర్, ఝాన్సీ డెవలప్ మెంట్ అథార్టీ వైస్ చైర్మ్, ఝాన్సీ జిల్లా మేజిస్ట్రేట్, ఝాన్సీ డివిజనల్ కమిషనర్, యూపీ పట్టణాభివృద్ధి అదనపు చీఫ్ సెక్రటరీలు వర్చువల్ విధానంలో తమ ముందు హాజరు కావాలని సూచించింది.