Categories: TOP STORIES

కో-వర్కింగ్ స్పేస్‌.. కొత్త డిమాండ్‌

దేశీయ కో–వర్కింగ్‌ పరిశ్రమ వచ్చే ఐదేళ్లలో ఏటా 15 శాతం వృద్ధి రేటుతో రెట్టింపు కానుంది. ప్రస్తుతం దేశంలో ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌ 3.5 కోట్ల చ.అ.లుగా ఉండగా.. ఇందులో 71 శాతం అంటే 2.5 కోట్ల చ.అ. స్పేస్‌ పెద్ద ఆపరేటర్లు నిర్వహిస్తున్నారని సీఐఐ–అనరాక్‌ నివేదిక వెల్లడించింది. ప్రధాన, ద్వితీయ శ్రేణి నగరాలలో 3.7 లక్షల కో–వర్కింగ్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఇప్పటికే కో–వర్కింగ్‌ స్పేస్‌ను వినియోగిస్తున్న కంపెనీలు, కొత్త సంస్థలు ఈ రంగంలో విస్తరించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారని అనరాక్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనూజ్‌ పూరీ తెలిపారు. స్మార్ట్‌వర్క్స్‌ వచ్చే 3–4 ఏళ్లలో 20 మిలియన్‌ చ.అ.లలో 2.5 లక్షల సీట్లను అందుబాటులోకి తీసుకురానుందని ఆయన పేర్కొన్నారు.

రిమోట్‌ వర్క్‌ విశ్వసనీయతపై డౌట్‌..

కరోనా నేపథ్యంలో ప్రారంభమైన రిమోట్‌ వర్కింగ్‌పై విశ్వసనీయత అనుమానం కారణంగా 90 శాతం కంపెనీలు ఫ్లెక్సిబుల్‌ ఆఫీస్‌ స్పేస్‌ వైపు మళ్లేందుకు ఇష్టపడుతున్నారని అనరాక్‌ లింక్డిన్‌ సర్వేలో తేలింది. హైబ్రిడ్‌ పని విధానం వైపు మొగ్గు చూపిస్తున్న కంపెనీలలో 46 శాతం కో–వర్కింగ్‌ స్పేస్‌ వైపు ఆసక్తి చూపిస్తున్నాయి. 30 శాతం మంది హబ్‌ అండ్‌ స్పోక్‌ మోడల్‌కు, 24 శాతం మంది ఇప్పటికే ఉన్న ఆఫీస్‌ లే–అవుట్‌ మార్పు కోసం ఫ్లెక్సిబుల్‌ స్పేస్‌ను ఇష్టపడుతున్నారని సర్వే వెల్లడించింది. ఉద్యోగుల వైపు నుంచి చూస్తే.. 54 శాతం మంది హైబ్రిడ్‌ పని విధానంపై ఆసక్తి చూపిస్తున్నారు. నెలలో కొన్ని రోజులు ఆఫీసు నుంచి మరికొన్ని రోజులు ఇంటి నుంచి పని చేసే విధంగా ఈ విధానం ఉంటుంది. 33 శాతం మంది పూర్తిగా ఆఫీసు నుంచి పనికే ఆసక్తి చూపిస్తున్నారు. 13 శాతం మంది చిన్న సైజు అపార్ట్‌మెంట్, పెద్ద కుటుంబాల కారణంగా ఇంటి నుంచి పని చేయడానికి ఇష్టపడుతున్నారు.

This website uses cookies.