హైదరాబాద్ నిర్మాణ రంగం కొత్త డెవలపర్లను ఎప్పుడూ ఆహ్వానిస్తుంది. ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం టాప్ నిర్మాణ సంస్థలన్నీ ఒకప్పుడు కొత్తవే కదా! కాబట్టి, రెరా అథారిటీ ఏర్పాటైన ప్రస్తుత తరుణంలో.. నిర్మాణ రంగం మరింత పారదర్శకత వైపు అడుగులు వేస్తున్నది. ఈ నేపథ్యంలో, కొత్త డెవలపర్లు విలువలతో కూడిన వ్యాపారం చేయాలి. స్థానిక సంస్థలు, రెరా నుంచి అనుమతి తీసుకుని.. నిబంధనల ప్రకారం నిర్మాణాల్ని చేపట్టినప్పుడే.. ఈ రంగంలో నిలబడతారు. లేకపోతే, అతి తక్కువ కాలంలోనే నిష్క్రమించే ప్రమాదం లేకపోలేదు.
హైదరాబాద్‌లో రియల్ రంగం ఎక్కడ్లేని అవకాశాల్ని కల్పిస్తోంది. నగరం నలువైపులా అపార్టుమెంట్లను కట్టినా అమ్మకాలకు ఎలాంటి ఢోకా ఉండదు. కాబట్టి, ఈ రంగంలో స్థిర పడాలని కోరుకునే వారికిదో చక్కటి అవకాశమని చెప్పొచ్చు. కాకపోతే, ఈమధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో.. ఛానల్ పార్టనర్లు, మేస్త్రీలు, ఏజెంట్లు, స్థల యజమానులూ అపార్టుమెంట్లను నిర్మిస్తున్నారు. అయితే, వీరిలో కొందరు.. యూడీఎస్, ప్రీలాంచులు అంటూ మధ్య తరగతి ప్రజానీకాన్ని బోల్తా కొట్టిస్తున్నారు. దీంతో చాలామంది అమాయకులు తమ కష్టార్జితాన్ని తీసుకొచ్చి వారి చేతిలో పోస్తున్నారు. మధ్యతరగతి ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టకుండా.. ఫ్లాట్లను అందించే బిల్డర్లే మార్కెట్లో నిలబడతారని గుర్తుంచుకోవాలి.