దేశంలో కొత్త ఇళ్ల డెలివరీ జోరుగా సాగుతోంది. ఎస్ డబ్ల్యూఏఎంఐహెచ్ ఫండ్ వంటి ప్రభుత్వ పథకాలతోపాటు డెవలపర్లపై పెరిగిన ఒత్తిడి నేపథ్యంలో దేశంలో ఇళ్ల డెలివరీలో 33 శాతం పెరుగుదల నమోదైంది. డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ఈక్విటీ నివేదిక ప్రకారం, భారతదేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో 2025 ఆర్థిక సంవత్సరంలో డెలివరీ అయిన ఇళ్ల సంఖ్య 33 శాతం పెరిగి 4,06,889 యూనిట్లకు చేరుకుంది. ఢిల్లీ మినహా మిగిలిన ఎనిమిది నగరాల్లో 22 శాతం నుంచి 88 శాతం వరకు వృద్ధి నమోదైంది. 88 శాతంతో కోల్ కతా అగ్రస్థానంలో ఉండగా.. 22 శాతంతో ముంబై చివరన నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీలో 8 శాతం తగ్గుదల నమోదైంది.
2024 ఆర్థిక సంవత్సరంలో 3,06,600 ఇళ్లు డెలివరీ కాగా, 2025లో ఆ సంఖ్య 4,06,889కి పెరిగింది. కోల్‌కతా 88 శాతంతో అగ్ర స్థానంలో ఉంది. 2024లో 9,441 ఇళ్లు డెలివరీ కాగా, 2025 ఆర్థిక సంవత్సరంలో 17,718 ఇళ్లు డెలివరీ అయ్యాయి. 61 శాతం పెరుగుదలతో హైదరాబాద్, 49 శాతం వృద్ధితో చెన్నై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీలో 2024 ఆర్ధిక సంవత్సరంలో 48,388 యూనిట్లు డెలివరీ కాగా, 2025 ఆర్థిక సంవత్సరంలో 44,423 యూనిట్లు డెలివరీ అయ్యాయి.