ఈమధ్య చెన్నైకి చెందిన కాసా గ్రాండ్ సంస్థ భారీ ప్రకటనలతో తెగ హడావిడి చేస్తోంది. మొదటి వారంలోనే వందకు పైగా ఫ్లాట్లను విక్రయించామని పేపర్ ప్రకటనల్ని విడుదల చేసింది. ఆతర్వాత రాజేంద్రనగర్లో మరో కొత్త ప్రాజెక్టును అట్టహాసంగా ఆరంభించింది. పొరుగు రాష్ట్రానికి చెందిన నిర్మాణ సంస్థ హైదరాబాద్‌లోకి అడుగుపెట్టి మన రియల్ మార్కెట్లో హల్చల్ చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమే.
మీకు గుర్తుందా? ఒకట్రెండేళ్ల క్రితం అదే చెన్నైకి చెందిన జీ స్క్వేర్ సంస్థ ఇలాగే హైదరాబాద్‌లో రెండు ప్రాజెక్టుల్ని ప్రారంభించి ఎక్కడ్లేని హడావిడి చేసింది. ఆ సంస్థ చేసిన ప్రచారాన్ని బయ్యర్లంతా ఆయా వెంచర్ల వైపు క్యూ కట్టారు. తీరా, కొన్నాళ్ల తర్వాత ఆయా వెంచర్లలో ఏవో సమస్యలున్నాయంటూ తెలుసుకుని వాటి నుంచి బయటికొచ్చేసింది. అదృష్టవశాత్తు అవి వెంచర్లే కాబట్టి.. కొనుగోలుదారులు పెద్దగా నష్టపోలేదనే చెప్పాలి. కానీ, తాజాగా కాసా గ్రాండ్ బహుళ అంతస్తుల ప్రాజెక్టుల్ని నిర్మిస్తోంది. వీటికి టీజీ రెరా అనుమతి లభించింది. అయితే, నిర్మాణాలు కట్టిన తర్వాత ప్రాజెక్టులో ఏమైనా సమస్యలు వస్తే ఎలా?
మీరు చెన్నై సంస్థ వద్ద ఫ్లాట్ కొంటున్నా.. బెంగళూరు కంపెనీ వద్ద విల్లా తీసుకుంటున్నా.. హైదరాబాద్ బిల్డర్ వద్ద అయినా.. మీరు సొంతిల్లు కొనుక్కునే క్రమంలో సేల్ అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు.. ఆయా డాక్యుమెంట్ రెరా పరిధిలోనే ఉందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇదే విషయాన్ని మీరు బిల్డర్‌ను అడిగి తెలుసుకోవాలి. రెరా నిబంధనలకు లోబడి సేల్ అగ్రిమెంట్ ఉంటేనే మీరు దాన్ని మీద సంతకం పెట్టండి.
ALSO READ: త్రిపుర కన్‌స్ట్రక్షన్స్ ప్రీలాంచ్ మోసం?
అధిక శాతం మంది బిల్డర్లు ఏం చేస్తున్నారంటే.. ముందుగా ప్రీలాంచ్ సేల్ లేదా ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరిట ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. కొనుగోలుదారుల నుంచి ముందే చెక్కుల రూపంలో సొమ్ము తీసుకుని.. రెరా నంబర్ వచ్చాకే సేల్ అగ్రిమెంట్ చేసిస్తున్నారు. ఇలాంటప్పుడు అధిక శాతం మంది బిల్డర్లు సేల్ అగ్రిమెంట్‌ను ఏకపక్షంగా రాసుకుంటున్నారు. ఫ్లాట్లను కొనుగోలు చేసేవారిలో ఎక్కువ శాతం మందికి ఆయా అగ్రిమెంట్‌లో ఏముందో తెలుసుకోరు. అదేదో తమకు సంబంధం లేని వ్యవహారం అన్నట్లుగా కొందరు భావిస్తుంటారు. అందుకే, గుడ్డిగా ఆయా సేల్ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేస్తుంటారు. అయితే, ప్రతిఒక్క బయ్యర్ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. బిల్డర్ రెరా నిబంధనలకు లోబడి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసివ్వాలి. ఇదే విషయాన్ని మీరు బిల్డర్‌ని అడగాలి. రెరా నిబంధనల ప్రకారమే సేల్ అగ్రిమెంట్ చేసివ్వమని చెప్పాలి.
రెరా చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత బిల్డర్లు ఏకపక్షంగా సేల్ అగ్రిమెంట్ చేసిస్తానంటే కుదరదు. పొరపాటున ఏదైనా సమస్య వచ్చి.. కొనుగోలుదారులు రెరా మెట్లు ఎక్కితే.. బిల్డర్ చేసిన ఏకపక్ష అగ్రిమెంట్ చెల్లదు. అగ్రిమెంట్‌లో పదాలు మార్చినా న్యాయస్థానాలు ఒప్పుకోవడం లేదనే విషయాన్ని గమనించాలి.
ఒకవేళ ఎవరైనా బిల్డర్.. రెరా ప్రకారం అగ్రిమెంట్ రాయకపోతే గనక.. పొరపాటున ఏదైనా ఇష్యూ వల్ల.. వివాదం ఏర్పడితే.. ఆయా బిల్డర్లపై జరిమానా పడుతుందనే విషయాన్ని గమనించాలి. కాబట్టి, నిర్మాణ సంస్థలు ఎప్పుడైనా రెరా చట్టానికి లోబడి అగ్రిమెంట్లు చేసుకుంటే మేలు.