-
బొల్లారంలోని వర్రకుంట చెరువు వద్ద
గ్రేటర్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ విల్లా ప్రాజెక్టు
-
చెరువు కబ్జా చేసి కడుతున్నారంటూ ఎన్జీవో ఫిర్యాదు
-
పరిశీలించాల్సిందిగా హెచ్ఎండీఏ,
సంగారెడ్డి కలెక్టర్ కు ట్రిబ్యునల్ ఆదేశం
బొల్లారంలోని ఓ చెరువు వద్ద నిబంధనలు ఉల్లంఘించి బీఆర్ఎస్ కార్పొరేటర్ కు చెందిన కంపెనీ నిర్మిస్తున్న విల్లా ప్రాజెక్టును పరిశీలించాల్సిందిగా హైదరాబాద్ మెట్రోపాలిటర్ డెవలప్ మెంట్ అథార్టీ (హెచ్ఎండీఏ), సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. అంతే కాకుండా కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ప్రాంతీయ కార్యాలయాన్ని కూడా ఈ విషయంలో ఆగస్టు 4లోగా స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాని ఆదేశాలు జారీ చేసింది. మానవ హక్కులు, వినియోగదారుల సంరక్షణ సెల్ ట్రస్టు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
‘జిన్నారం మండలం బొల్లారంలోని సర్వే నెంబర్ 82, 83లో ఉన్న వర్రకుంట చెరువును గ్రేటర్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్, ఇతరులు కలిసి నిర్మాణ ప్రదేశంగా మార్చేశారని ఫిర్యాదు అందింది. చెరువుకు సంబంధించి 2010 నుంచి ఇప్పటివరకు ఉన్న చిత్రాలను పరిశీలిస్తే చెరువు మొత్తం ధ్వంసం చేసినట్టు కనిపిస్తోంది. హెచ్ఎండీఏ కూడా అక్కడ విల్లా నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్టు అర్థమవుతోంది. ఒకవేళ ఇంకా అక్కడ విల్లా నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతుంటే అందుకు వారిదే బాధ్యత. ఒకవేళ ఆ విల్లాలు చెరువుపైనే నిర్మించి ఉంటే వాటిని కూల్చివేయాలని ఆదేశించడానికి ఏ మాత్రం సంశయించం’ అని ఎన్జీటీ స్పష్టం చేసింది.
ఫిర్యాదు ఇచ్చిన ఎన్జీవో సంస్థకు చెందిన ఠాకూర్ రాజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. సర్వే నెంబర్లను పేర్కొనకుండా అక్కడ విల్లాలు నిర్మించడానికి గ్రేటర్ ఇన్ ఫ్రా ప్రాజెక్టుకు హెచ్ఎండీఏ అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఆ కంపెనీకి బీఆర్ఎస్ కార్పొరేటర్ ప్రమోటర్, డైరెక్టర్ గా ఉన్నారని వివరించారు. అధికారుల సహాయ సహకారాలతో ఆ చెరువును పూర్తిగా ఆక్రమించినట్టు గూగుల్ చిత్రాలతో తెలుస్తోందన్నారు. కాగా, వర్రకుంట చెరువులో నిర్మాణ వ్యర్థాలు పడేస్తున్న విషయాన్ని పరిశీలించిన తర్వాత గ్రేటర్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ కు ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ నోటీసులు జారీ చేసింది. ఆ వాటర్ బాడీ బఫర్ జోన్ లో నిర్మాణ కార్యకలాపాలను వెంటనే ఆపేయాలని ఆదేశించింది. చెరువు 81, 83, 84 సర్వే నెంబర్లలో ఉందని గ్రేటర్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్స్ డైరెక్టర్ కేవీ ప్రసాదరావు తెలిపారు. తాము సర్వే నెంబర్ 82లో ఏడున్నర ఎకరాల స్థలంలో ప్రాజెక్టు నిర్మిస్తున్నట్టు చెప్పారు.