కేంద్ర బడ్జెట్ వచ్చేస్తోంది. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు ఏమైనా వరాలు కురిపిస్తుందేమోననే ఆశ అన్ని వర్గాల్లోనూ ఉన్నట్టే రియల్ రంగంలోనూ ఉంది. దేశ జీడీపీకి అతిపెద్ద సహకారుల్లో ఒకటిగా, గణనీయమైన ఉపాధి వనరుగా ఉన్న స్థిరాస్తి రంగం కేంద్ర బడ్జెట్ లో తనకంటూ కొన్ని సానుకూల నిర్ణయాలు ఉండకపోతాయా అనే ఆశలో ఉంది. ముఖ్యంగా హౌసింగ్ ను మరింత సరసమైనదిగా చేయడం, పన్నులను సరళీకృతం చేయడం, రియల్ రంగంలోకి పెట్టుబడుల ప్రవాహాలను పెంచడం వంటి నిర్ణయాలు ఉండాలని రియల్ రంగం ఎదురుచూస్తోంది. ఫిబ్రవరి ఒకటిన కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో రియల్ ఎస్టేట్ రంగానికి ఏమి ఉండాలనే అంశంపై పలువురు పరిశ్రమ నిపుణులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. అవేంటో చూద్దామా?
రియల్ రంగ వృద్ధిని కొనసాగించేలా బడ్జెట్ లో సంస్కరణలు ఉంటాయనే ఆశతో ఉన్నట్టు సిగ్నేచర్ గ్లోబల్ (ఇండియా) లిమిటెడ్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ శ్రీ ప్రదీప్ అగర్వాల్ పేర్కొన్నారు. పెరుగుతున్న ప్రాపర్టీ ధరలు, నిర్మాణ వ్యయాలకు అనుగుణంగా గృహరుణాలపై ప్రస్తుతం ఉన్న పన్ను మినహాయింపును రూ.5 లక్షలకు పెంచాలని సూచించారు. ఇది ఇళ్ల కొనుగోలుదారులకు మంచి ఉపశమనం కలిగిస్తుందని చెప్పారు. ఈ నిర్ణయం నేరుగా లక్షలాది మందికి ఉపయోగకరంగా ఉండటమే కాకుండా రియల్ రంగ డిమాండ్ కు మరింత ఊతమిస్తుందని స్పష్టంచేశారు. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. దీనికి ఇండస్ట్రీ హోదా ఇస్తే దాదాపు 200 అనుబంధ రంగాలను ఉత్తేజపరుస్తుందని.. అలాగే ఉద్యోగ కల్పనను ప్రోత్సహిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం, ఆర్థిక కార్యకలాపాలను విస్తరింపజేయడం, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉంటూ రియల్ రంగ స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుందని అంటున్నారు.
వికసిత్ భారత్-2047 వైపు ప్రయాణంలో రియల్ ఎస్టేట్ రంగం తన పాత్రను పోషించడానికి సిద్ధంగా ఉందని నిపుణులు స్పష్టంచేస్తున్నారు. ఇందుకోసం జీఎస్టీ ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ నిబంధనలను సరళీకరించడం వంటి వ్యూహాత్మక సంస్కరణల ద్వారా డెవలపర్ల పన్ను భారాన్ని తగ్గించాలని కోరుతున్నారు. అలా చేస్తే ప్రాపర్టీ ధరలు స్థిరీకరించే అవకాశం ఉంటుందని.. తద్వారా ఇళ్లు మరింత అందుబాటులోకి వస్తాయని వివరిస్తున్నారు. అలాగే రూ.కోటి వరకు గృహరుణాలపై రూ.5 లక్షల వరకు సబ్సిడీ ఇస్తే.. అర్బన్, సెమీ అర్బన్ కొనుగోలుదారులకు ఆర్థిక సహాయం అందించినట్టు అవుతుందని పేర్కొంటున్నారు. అందుబాటు ధరల విభాగంలోకి రూ.కోటి వరకు ధర కలిగినవాటిని కూడా చేర్చడం వల్ల అందరికీ ఇళ్లు అనే ప్రభుత్వ భావన బలోపేతం అవుతుందని విశ్లేషిస్తున్నారు. ఈ సంస్కరణలన్నీ అమలు చేస్తే.. రియల్ రంగ సామర్థ్యం మరింత పెరుగుతుందని, దేశ అభివృద్ధి లక్ష్యాల వైపు ఈ రంగం పయనిస్తుందని చెబుతున్నారు.
‘బడ్జెట్ లో ఆర్థిక కార్యకలాపాలను పెంపొందించేలా సమర్థవంతమైన పలు సంస్కరణలు ప్రవేశపెట్టాలని రియల్ ఎస్టేట్ సహా వివిధ రంగాలు ఆశిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగం జీడీపీకి అతిపెద్ద సహకారాలలో ఒకటిగా ఉంది. వృద్ధిని పెంపొందించడంలో ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుంది. హౌసింగ్ లోన్లపై పన్ను మినహాయింపు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలి. దీనివల్ల ఇళ్ల డిమాండ్ బాగా పెరుగుతుంది. సుస్థిర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో హరిత, పర్యావరణ అనుకూల ఇళ్లకు కొన్ని రకాల ప్రోత్సాహకాలు ఇవ్వాలి’ అని క్రిసుమి కార్పొరేషన్ ప్రెసిడెంట్, సీఈఓ ఆకాష్ ఖురానా సూచించారు. “రాబోయే బడ్జెట్‌కు చాలా ప్రాముఖ్యత ఉంది, ఎందుకంటే ఇది మోడీ 3.0 ప్రభుత్వం మొదటి పూర్తి-సంవత్సర బడ్జెట్.
మేము రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలకు ప్రయోజనం చేకూర్చడానికి ఉద్దేశించిన ప్రధాన ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నాం’ అని నింబస్ గ్రూప్ సీఈఓ సాహిల్ అగర్వాల్ పేర్కొన్నారు. గృహ కొనుగోలుదారులపై విధించే పన్నులు, సుంకాల హేతుబద్ధీకరణపై దృష్టి సారించాలని సూచించారు. ‘ఇది చాలా రాష్ట్రాల్లో ఆస్తి విలువలో 12% కంటే ఎక్కువగా ఉంటుంది. గత బడ్జెట్లో, ఆర్థిక మంత్రి ఈ సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.
అయితే గణనీయమైన పురోగతి ఇంకా జరగలేదు. ఈ ఛార్జీలను క్రమబద్ధీకరించడానికి, గృహ కొనుగోలుదారులకు అవసరమైన ఉపశమనాన్ని అందించడానికి ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నాం. రియల్ ఎస్టేట్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును పునఃసమీక్షించాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత ఆకర్షణీయమైన పెట్టుబడి ఎంపికగా మార్చడానికి జీఎస్టీ సంస్కరణల వైపు అడుగులు వేయడం కూడా అవసరమని నిపుణులు చెబుతున్నారు. మెట్రో నెట్‌ర్కులు, మల్టీమోడల్ కారిడార్లు, లాస్ట్ మైల్ కనెక్టివిటీ ప్రాజెక్టులు సహా మౌలిక సదుపాయాల అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులను పెంచడాన్ని కూడా ప్రభుత్వం పరిగణించాలని సూచిస్తున్నారు.
This website uses cookies.