ఇంట్లో కారు పెట్టుకునే స్థలం లేకపోతే ఆయా కారును ఇక నుంచి రిజిస్టర్ చేయరా? అంటే ఔననే అంటున్నారు అధికారులు. మీరు సొంతంగా ఇల్లు కట్టుకున్నా.. అపార్టుమెంట్లో ఫ్లాట్ కొనుక్కున్నా.. కారు పార్కింగ్ స్థలం చూపెడితేనే రిజిస్ట్రేషన్ చేసే సరికొత్త విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుందని సమాచారం. ఇది అమల్లోకి వస్తే.. సాధారణ ప్రజానీకానికి ఎంతో మేలు కలిగే అవకాశముంది.
హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో.. కొంతమంది ప్రబుద్ధులేం చేస్తున్నారంటే.. వంద, రెండు వంద గజాల స్థలంలో.. అనుమతి లేకుండా నాలుగైదు అంతస్తుల్ని కట్టేస్తున్నారు. ఒక్కసారి యూసుఫ్ గూడాలోని శ్రీ కృష్ణానగర్ వంటి కాలనీలను గమనిస్తే.. గత పదేళ్లలో అనేక మంది రెండు వందల గజాల్లో నాలుగైదు అంతస్తుల్ని కట్టేశారు. ఇక అందులో నివసించేవారంతా తమ వాహనాల్ని ఇంటి బయటే పార్కింగ్ చేసుకుంటున్నారు. అసలే 20 నుంచి 30 అడుగులుండే రోడ్డుకి అటూఇటూ వాహనాల్ని పెట్టడం వల్ల.. అర్థరాత్రివేళలో అత్యవసరాల్లో ఆంబులెన్స్ కూడా వెళ్లలేని దుస్థితి ఎదురవుతోంది. ఫలితంగా, సకాలంలో వైద్యం అందక అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా, ఇలాంటి అక్రమ నిర్మాణాల సంఖ్య హైదరాబాద్లోని అనేక కాలనీల్లో నిత్యకృత్యంగా మారింది. స్థానిక జీహెచ్ఎంసీ అధికారులను ఏదోరకంగా మేనేజ్ చేసి.. ప్రజలు అక్రమంగా ఇళ్ల నిర్మాణం జరుపుతున్నారు. ఈ అంశాన్ని క్షుణ్నంగా గమనించిన ప్రభుత్వం.. కార్లను రిజిస్ట్రేషన్ చేయాలంటే కారు పార్కింగ్ చూపెట్టాలనే నిబంధనను తెచ్చేందుకు ప్రణాళికల్ని రచిస్తుందని సమాచారం. ఈ విధానం అందుబాటులోకి వస్తే.. అక్రమ నిర్మాణాలు తగ్గుతాయని.. కేవలం పార్కింగ్ సౌకర్యం ఉన్నవారే వాహనాల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలు కలుగుతుందన్నారు. ఆయా ప్రాంతంలోని మౌలిక సదుపాయాల మీద ఒత్తిడి కూడా గణనీయంగా తగ్గుతుందని నరెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ తెలిపారు.
This website uses cookies.