దేశంలో ఆఫీస్ మార్కెట్ ఈ ఏడాది రెండో త్రైమాసికంలో బలమైన పనితీరు కొనసాగించింది. దేశంలోని ఆరు ప్రధాన నగారాల్లో 15.8 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ లీజింగ్ నమోదైంది. గత త్రైమాసికంతో పోలిస్తే.. 16 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఆరు నగరాల్లో 4 నగరాల్లో 20 శాతం కంటే ఎక్కువ పెరుగుదల కనిపించింది. ముఖ్యంగా బెంగళూరు, ముంబైలో ఆఫీస్ డిమాండ్ బాగా పెరిగింది. ఇక్కడ ఆఫీస్ స్పేస్ డిమాండ్ బీఎఫ్ఎస్ఐ, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ తయారీ వంటి విభిన్న రంగాలకు చెందిన సంస్థలతోనే ఎక్కువగా ఉంది. ముంబైలో చాలాకాలం తర్వాత ఈ త్రైమాసికంలో 3.5 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ నమోదు కావడం విశేషం. 2023 క్యూ2తో పోలిస్తే ఇది రెండింతలు కావడం గమనార్హం.
గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ లీజింగ్ పాన్ ఇండియాలో 2023 క్యూ2లో 14.6 మిలియన్ చదరపు అడుగులు కాగా, 2024 క్యూ2లో 15.8 మిలియన్ చదరపు అడుగులుగా నమోదైంది. వార్షిక ప్రాతిపదికన 8 శాతం అధికం. అదే 2023 ప్రథమార్థంలో 24.8 మిలియన్ చదరపు అడగులు లీజింగ్ నమోదు కాగా, 2024 ప్రథమార్థంలో 19 శాతం వృద్ధితో 29.4 మిలియన్ చదరపు అడుగుల లీజింగ్ నమోదైంది. గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ సరఫరా కూడా బలమైన పనితీరు కనబరిచింది. 2024 ప్రథమార్థంలో 23 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ సరఫరా అయింది. 2024 క్యూ2లో దేశంలోని 6 ప్రధాన నగరాల్లో 6 శాతం వృద్ధితో 13.2 మిలియన్ చదరపు అడుగుల సరఫరా జరిగింది. ఈ సరఫరాలో ముంబై 30 శాతం వాటా కలిగి ఉండగా.. 27 శాతం వాటాతో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది.