భారీగా పెట్టుబడులు సమీకరించిన రియల్ కంపెనీలు
దేశంలో రియల్ ఎస్టేట్ పరిశ్రమ జోరు కొనసాగిస్తోంది. కరోనా కాలంలో కాస్త ఒడుదొడుకులకు లోనైనా.. తర్వాత పుంజుకుని దూసుకెళ్తోంది. కొనుగోలుదారుల నుంచి ఉన్న డిమాండ్ కు అనుగుణంగానే పరిశ్రమ ముందుకెళ్తోంది. ఈ క్రమంలో భారీగా పెట్టుబడులు సమీకరిస్తోంది. గత 20 నెలల్లో రియల్ ఎస్టేట్ సంస్థలు ఏకంగా రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు సమీకరించాయి.
దాదాపు 92 శాతం పెట్టుబడులను డెట్ ఇష్యూల జారీ ద్వారానే సమీకరించడం విశేషం. దీంతోపాటు మరో రూ.28వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఇష్యూలు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి.
హౌసింగ్ మార్కెట్లో బూమ్‌కు తోడు స్థిరమైన నగదు ప్రవాహాలు ఈ రంగంలోని కంపెనీలకు అనుకూలిస్తున్నాయి. తక్కువ క్రెడిట్ రిస్క్ ఉండడంతో డెట్ పత్రాల మార్గంలో నిధుల సమీకరణకు మొగ్గు చూపిస్తున్నాయి. 2023, 2024లో ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్, సివిల్ కన్‌స్ట్రక్షన్ కంపెనీలు డెట్ మార్గంలో రూ.95,975 కోట్ల నిధులు సమీకరించాయి. ఈక్విటీ రూపంలో నిధుల సమీకరణ తక్కువగానే ఉన్నప్పటికీ, ఈ ఏడాది గణనీయంగా పెరిగింది.
2023లో ఈక్విటీ జారీ రూపంలో రియల్ ఎస్టేట్, నిర్మాణ కంపెనీలు రూ.124 కోట్లు రాబట్టగా, 2024లో ఇప్పటి వరకు రూ.8,772 కోట్లు సమీకరించాయి. లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీల అమ్మకాలు కరోనా అనంతరం ఏటా 15-20 శాతం మేర వృద్ధి చెందడంతో నగదు ప్రవాహాలు మెరుగయ్యాయి.