Categories: TOP STORIES

ఛానెల్ పార్ట్‌న‌ర్ల‌తో చ‌క్క‌బెట్టేసిన సంస్థ‌!

 

  • ప్రీలాంచ్‌లో జోరుగా ఫ్లాట్ల విక్ర‌యం
  • అట్టి ప్రాజెక్టుల‌కు రెరా అనుమ‌తి!
  • ఇలాగైతే రెరా ఉన్నా ఏం లాభం?
  • నిర్మాణ సంఘాలు ఆలోచించాలి!

బెంగ‌ళూరుకు చెందిన ప్రెస్టీజ్ సంస్థ‌.. హైద‌రాబాద్‌లోనే అతిపెద్ద సిటీని నిర్మిస్తున్నామంటూ ప్ర‌క‌ట‌న‌ల వ‌ర్షం కురిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈమ‌ధ్యే ప్రాజెక్టుకు రెరా అనుమ‌తి కూడా ల‌భించ‌డంతో ఈ నెల‌లోనే ప్రాజెక్టును ఆరంభించే అవ‌కాశాలున్నాయి. ఇంత‌టి బ‌డా సంస్థ రెరా నిబంధ‌న‌ల్ని ప‌ట్టించుకోకుండా.. ఎక్స్‌ప్రెష‌న్ ఆఫ్ ఇంట్రెస్ట్ రూపంలో కొనుగోలుదారుల నుంచి అడ్వాన్సు చెక్కుల్ని వ‌సూలు చేసింది. అయితే, ఈ సంస్థ తెలివిగా ఏం చేసిందంటే.. ప్రీలాంచ్ అమ్మ‌కాల్లో భాగంగా.. కొనుగోలుదారుల నుంచి అడ్వాన్సు చెక్కుల్ని తీసుకోమ‌ని ఛానెల్ పార్ట్‌న‌ర్ల‌కు సూచించింది. దీంతో అట్టి చెక్కుల్ని స‌ద‌రు ఛానెల్ పార్ట్‌న‌ర్లు రెరా అనుమ‌తి వ‌చ్చేంత వ‌ర‌కూ త‌మ వ‌ద్ద అట్టి పెట్టుకున్నార‌ని స‌మాచారం. రెరా వ‌చ్చాకే ఆయా చెక్కుల్ని సంస్థ తీసుకున్న‌ట్లు స‌మాచారం.

ఛానెల్ పార్ట్‌న‌ర్లు మొత్తం ఇన్వెస్ట‌ర్ల నుంచి ఎంచ‌క్కా అడ్వాన్సు చెక్కుల్ని తీసుకున్నారు. దాదాపు వెయ్యిమందికి పైగా ఇన్వెస్ట‌ర్ల నుంచి వ‌సూలు చేసిన కొన్నాళ్ల త‌ర్వాత.. ప్రెస్టీజ్ సిటీకి రెరా అనుమ‌తి ల‌భించింది. దీంతో, ఇప్పుడిక ద‌ర్జాగా ఆయా ఛానెల్ పార్ట్‌న‌ర్ల నుంచి చెక్కుల్ని తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఏదీఏమైనా, ఎక్స్‌ప్రెష‌న్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద బ‌య్య‌ర్ల నుంచి చెక్కులు తీసుకుంటుంద‌న్న విష‌యం టీఎస్ రెరాకు తెలిసినా పెద్ద‌గా ప‌ట్టించుకోలేద‌ని నిర్మాణ రంగం విమ‌ర్శిస్తోంది. బ‌డా బిల్డ‌ర్ల‌కో న్యాయం.. చిన్న డెవ‌ల‌ప‌ర్ల‌కో న్యాయాన్ని టీఎస్ రెరా అమ‌లు చేయ‌కూడ‌ద‌ని అభిప్రాయ‌ప‌డింది.

హైద‌రాబాద్‌లో అనేకమంది బిల్డ‌ర్లు నేటికీ ప్రీలాంచుల్లో ఫ్లాట్ల‌ను విక్ర‌యిస్తున్నారు. ఎన్నిక‌ల కార‌ణంగానేమో తెలియ‌దు కానీ రెరా అథారిటీ కూడా పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని స‌మాచారం. ఇలా ప‌లువురు డెవ‌లప‌ర్లు ప్రీలాంచ్‌ అమ్మ‌కాల్ని నిర్వ‌హించిన‌ప్ప‌టికీ, ఆయా ప్రాజెక్టుల‌కు రెరా ఎంచ‌క్కా అనుమ‌తిని మంజూరు చేస్తోంది. అంటే, రెరా లేకుండా ప్రీలాంచుల్ని చేసినందుకు అట్టి ప్రాజెక్టుల‌పై ప్రాజెక్టు విలువ‌లో ప‌ది శాతం జ‌రిమానా విధించ‌కుండా.. ఎంచ‌క్కా రెరా అనుమ‌తిని మంజూరు చేస్తోంది. ఇలా వ్య‌వ‌హ‌రించేట‌ట్ల‌యితే, టీఎస్ రెరా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా వ్య‌ర్థ‌మేనని చెప్పొచ్చు.

This website uses cookies.