మియాపూర్లో ఫ్లాట్ల నిర్మాణం జోరందుకుంది. గతంలో కంటే ఈమధ్య అధిక స్థాయిలో కొత్త ఫ్లాట్లు ఆరంభమయ్యాయి. మియాపూర్ చౌరస్తా నుంచి గండిమైసమ్మ దాకా కనీసం పదిహేను వేల ఫ్లాట్ల నిర్మాణం జరుగుతోంది. ఇందులో చిన్న అపార్టుమెంట్లతో పాటు నలభై ఐదు అంతస్తుల ఆకాశహర్మ్యాలూ ఉన్నాయి. మియాపూర్లోని ఎస్ఎంఆర్ వినయ్ సిటీ చుట్టుపక్కల క్యాండియర్ 40, ప్రైమార్క్, ఆర్‌వీ నిర్మాణ్, వర్టెక్స్, నైలా, సియా కన్‌స్ట్రక్షన్స్, క్యాండియర్ ట్విన్స్ వంటి సంస్థలే దాదాపు ఐదు వేల ఫ్లాట్లను నిర్మిస్తున్నాయి. కోకా కోలా ఫ్యాక్టరీ చౌరస్తా నుంచి బాచుపల్లి చౌరస్తా వరకూ గల మెయిన్ రోడ్డుతో పాటు అక్కడి చుట్టుపక్కల ప్రాంతాల్లో మరో ఐదు వేల ఫ్లాట్ల నిర్మాణం జరుగుతోంది. అమీన్‌పూర్, బాచుపల్లి చౌరస్తా నుంచి మల్లంపేట్, ప్రగతినగర్, బౌరంపేట్ వంటి ప్రాంతాల నుంచి గండి మైసమ్మ చుట్టుపక్కల ప్రాంతాలను లెక్కిస్తే.. మరో ఐదు వేల ఫ్లాట్ల నిర్మాణం జరుగుతోంది. మరి, ఇన్నిన్ని ఫ్లాట్లు ఎప్పటికీ అమ్ముడవుతాయి?
సాధారణంగా మియాపూర్, ప్రగతినగర్, బాచుపల్లి, మల్లంపేట్, బౌరంపేట్, నిజాంపేట్ వంటి ప్రాంతాల్లో ఏడాదికి సుమారు మూడు నుంచి నాలుగు వేల ఫ్లాట్లు దాకా అమ్ముడవుతాయి. తాజాగా, రెరా అనుమతి తీసుకున్న ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకుంటేనే.. సుమారు పదిహేను వేల ఫ్లాట్ల నిర్మాణం జరుగుతోంది. ఇవన్నీ పూర్తవ్వాలంటే ఎంతలేదన్నా నాలుగైదేళ్లు పడుతుంది. ఈలోపు ఏటా కొత్త నిర్మాణాలు ఆరంభం అవుతాయి. వాటినీ పరిగణనలోకి తీసుకుంటే.. ఈ ఫ్లాట్ల అమ్మకాలకు ఎంతలేదన్నా ఐదారేళ్లు పట్టే అవకాశముంది.
This website uses cookies.