నిర్మాణంలో భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు
మధ్యతరగతి వారిని ఆకర్షిస్తున్న పటాన్ చెరు
పటాన్ చెరు పరిసరాల్లో 45 లక్షల్లో ఫ్లాట్
ఇల్లు, ప్లాట్ కొనే ముందు అంతా ఆ ప్రాంతంలోని మౌలిక వసతుల గురించి ఆలోచిస్తారు. రవాణా, రహదారులు, నీటి సౌకర్యం, సమీపంలో విద్యాసంస్థలు, వైద్య సదుపాయం వంటివి చూసి ఇంటి కొనుగోలుపై నిర్ణయం తీసుకుంటారు. ఇదిగో ఇలా అన్ని విధాలుగా అభివృద్ది చెంది.. హైదరాబాద్ మహా నగరానికి సమీపంలో ఉన్న పటాన్ చెరు వైపు చూస్తున్నారు ఇప్పుడంతా. అవును ఔటర్ రింగ్ రోడ్డుకు అనుకొని ఉన్న పటాన్ చెరు పరిసర ప్రాంతాల్లో నిర్మాణ రంగం జోరందుకోవడం, అందరికి అందుబాటు ధరలో గృహాలు లభిస్తుండటంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ మార్కెట్ తారాజువ్వలా దూసుకుపోతోంది.
పటాన్ చెరు చుట్టుపక్కల ప్రాంతంలో భారీ నిర్మాణప్రాజెక్టులు వెలుస్తున్నాయి. అందరికి అందుబాటు ధరలో అపార్ట్ మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, విల్లాలు లభిస్తుండటంతో అంతా పటాన్ చెరు వైపు చూస్తున్నారు. నగరంలో జీవనం ఆర్థిక భారంగా మారిన మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చులో అన్ని వసతులు ఉన్న కేంద్రంగా పటాన్ చెరు ఆకర్షిస్తోంది. ముందు నుంచి పటాన్ చెరు పారిశ్రామిక వాడగా గుర్తింపు పొందింది. ఇక్కడికి సమీపంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన బీహెచ్ఈఎల్, ఇక్రిశాట్ వంటి వాటితో పాటు అనేక పరిశ్రమలు ఉన్నాయి. దీంతో లక్షలాది మంది పటాన్ చెరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉపాది పొందుతున్నారు. ఇక పటాన్ చెరు సమీపంలో ప్రముఖ విద్యా సంస్థలు ఏర్పాటవ్వడంతో, నగరానికి చెందిన వారితో పాటు చుట్టూ సమీప ప్రాంతాల్లోని విద్యార్ధులు ఇక్కడ అధికంగా చదువుకుంటున్నారు.
పటాన్ చెరు ఓటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉండటం బాగా కలిసి వస్తోంది. పటాన్ చెరు నుంచి 15 నిమిషాల్లో బీహెచ్ఈఎల్ కు చేరుకోవచ్చు. 20 నిమిషాల్లో మియాపూర్ మెట్రో స్టేషన్ కు వెళ్లిపోవచ్చు. కేవలం 30 నిమిషాల్లో ఐటీ హబ్ హైటెక్ సిటీ చేరుకునే అవకాశం ఉంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి 45 నిమిషాలు, గచ్చిబౌలి ఫైనాన్సియల్ జిల్లా, పలు ఐటీ కంపెనీలకు పటాన్ చెరు నుంచి 30 నిమిషాల్లో చేరుకోవచ్చు. దీంతో చాలా మంది ఐటీ ఉద్యోగులు పటాన్ చెరు ప్రాంతంలో గృహాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు.
పటాన్ చెరుకు సమీపంలో సుల్తాన్‌పూర్‌లో ప్రభుత్వం మెడికల్ డివైజెస్ పార్కు, కంది వద్ద ఐఐటీ , గీతం యీనివర్సిటీ ఏర్పాటు కావడం వంటి అంశాల వల్ల ఒక్కసారిగా పటాన్ చెరు హాట్ లొకేషన్‌గా మారింది. అంతే కాకుండా ముంబయి రహాదారిపైనే పటాన్ చెరు ఉండటంతో సంగారెడ్డి, మెదక్ జిల్లా వాసులు సైతం ఇక్కడ ఇల్లు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
హైదరాబాద్ వెస్ట్ లో ప్లాట్లు, విల్లాల ధరలు అధికంగా ఉండడంతో చాలామంది పటాన్ చెరు వైపు అడుగులు వేస్తున్నారు. చుట్టుపక్కల పలు గ్రామాల్లో నిర్మాణ సంస్థలు పెద్ద సంఖ్యలో వెంచర్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఒక్కో వెంచరు సుమారు 4 ఎకరాల నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్నాయి. ఈ పరిసర ప్రాంతాల్లో వినియోగదారులు ప్లాట్లు, విల్లాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పటాన్ చెరు సమీప ప్రాంతాల్లో ప్రస్తుతం సుమారు 60 నివాసప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. మియాపూర్, కూకట్ పల్లి, లింగంపల్లి లో అపార్ట్ మెంట్ లో డబుల్ బెడ్రూం ఫ్లాట్ కొనాలంటే.. సుమారు 90 లక్షల నుంచి కోటి రూపాయలు కావాల్సిందే. అదే పటాన్ చెరులో డబుల్ బెడ్రూం ఫ్లాట్ 45 లక్షల నుంచి 50 లక్షల రూపాయల్లో వస్తోంది. అంటే అపార్ట్ మెంట్ లో చదరపు అడుగు 3,800 నుంచి 4 వేల రూపాయల మధ్య ధరలున్నాయి. ప్రీమియం ప్రాజెక్టుల్లో అయితే చదరపు అడుగు 5 వేల నుంచి 8 వేల రూపాయలుగా ధరలున్నాయి.
ఇక పటాన్ చెరు సమీప ప్రాంతాల్లో ఇండిపెండెంట్ ఇల్లు కూడా భారీగా నిర్మాణం అవుతున్నాయి. 120 గజాల విస్తీర్ణం నుంచి మొదలు 200 గజాల విస్తీర్ణంవరకు గృహాల నిర్మాణం జరుగుతోంది. ప్రాంతం, ప్రాజెక్టుని బట్టి 80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఇండిపెండెంట్ ఇళ్ల ధరలు పలుకుతున్నాయి. పటాన్ చెరు పరిసరాల్లో విల్లా ప్రాజెక్టులు సైతం భారీగానే నిర్మాణం జరుపుకుంటున్నాయి. విల్లాలైతే కోటీ 50 లక్షల రూపాయల నుంచి మొదలు 6 కోట్ల రూపాయల వరకు ధరలు ఉన్నాయి. నగరంలోని ఐటీ హబ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు కేవలం 30 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉండటంతో ఐటీ ఉద్యోగులు, మధ్యతరగతి వారు ఎక్కువగా పటాన్ చెరు మార్గంలో ఇల్లు కొంటున్నారు. రానున్న రెండు సంవత్సరాల్లో పటాన్ చెరు రూపురేఖలు మరింత మారనున్నాయని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.