Categories: TOP STORIES

పీఈ పెట్టుబడులూ తగ్గాయ్

40 శాతం మేర తగ్గుదల

దేశీయ కంపెనీల్లోకి ప్రైవేట్ ఈక్విటీ (పీఈ), వెంచర్ క్యాపిటల్ (వీసీ) పెట్టుబడులు ఈ ఏడాది 40 శాతం క్షీణించాయి. ఇప్పటివరకు 27.9 బిలియన్ డాలర్లకు మాత్రమే పరిమితమయ్యాయి. అదే సమయంలో పెట్టుబడుల ఉపసంహరణ స్వల్పంగా పెరిగి 19.34 బిలియన్ డాలర్లకు చేరింది. 2023 డిసెంబర్ 30 నాటికి పీఈ, వీసీ సంస్థలు 697 లావాదేవీల ద్వారా 27.9 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టినట్టు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది.

2022లో 1,364 డీల్స్ ద్వారా 47.62 బిలియన్ డాలర్లు వచ్చాయి. అలాగే 2022లో 233 లావాదేవీల ద్వారా 18.45 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా ఈసారి లావాదేవీల సంఖ్య 248 డీల్స్ తో 19.34 బిలియన్ డాలర్లకు పెరిగింది. టాప్ 5 పెట్టుబడులను చూస్తే.. ఏప్రిల్‌లో మణిపాల్ హాస్పిటల్‌లో టీపీజీ క్యాపిటల్, టెమాసెక్ 2.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిలాను బేరింగ్ ఏషియా, క్రిస్‌క్యాపిటల్ 1.35 బిలియన్ డాలర్లకు దక్కించుకున్నాయి.

ఆగస్టులో రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో ఖతర్ ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ 1 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. ఏప్రిల్‌లో అవాడా వెంచర్స్‌లో బ్రూక్‌ఫీల్డ్ 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. జూలైలో ఫెర్టిలిటీ క్లినిక్‌ల సంస్థ ఇందిరా ఐవీఎఫ్ క్లినిక్స్‌కి బేరింగ్ ఏషియా 732 మిలియన్ డాలర్లు అందించింది. రంగాలవారీగా పరిశీలిస్తే.. హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ లో అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి. ఇంధన (14.5 శాతం), రిటైల్ (98.8 శాతం), అడ్వర్టైజింగ్.. మార్కెటింగ్‌లో (199.8 శాతం) పెట్టుబడులు పెరిగాయి.

This website uses cookies.