ఓఆర్ఆర్ -ఆర్ఆర్ఆర్ మధ్య రావిర్యాల నుంచి అమన్‌గల్ వరకు నిర్మించనున్న రహదారిలో మూడు చోట్ల ఉన్న అటవీ ప్రాంతాలను నైట్ సఫారీలుగా మార్చే అంశంపై కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. అంతర్జాతీయ విమానాశ్రయం, నగరం, అటవీ ప్రాంతం సమీపంలోనే ఉండడం అరుదని, ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
బెంగళూర్‌లో జిందాల్ నేచర్ కేర్ పెట్టారని, మనకు ఉన్న అటవీ ప్రాంతం, అనుకూలతలు తెలియజేస్తే అటువంటివి ఎన్నో వస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. ఫోర్త్ సిటీలోని పరిశ్రమలకు అటవీ ప్రాంతాలను అనుసంధానిస్తే అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందంటూ అమెరికాలో యాపిల్ పరిశ్రమ అక్కడ యాపిల్ తోటలోనే ఉన్న అంశాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఈ సందర్బంగా రాచకొండ పరిధిలోని లోయలు… ప్రకృతి సౌందర్యం సినీ పరిశ్రమను ఆకర్షించడానికి ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు.