ప్రైవేటు వ్యక్తుల నుంచి భూమి
సేకరణ సక్రమంగా జరగాలి
సుప్రీంకోర్టు స్పష్టీకరణ
ప్రైవేటు వ్యక్తుల నుంచి భూమి వంటి ఆస్తుల స్వాధీనం చేసుకునే విషయంలో ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని, నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారీతిన చేసుకనే స్వాధీనాలు చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. భూమికి సంబంధించి నష్టపరిహారం చెల్లించినప్పటికీ, ఆ స్వాధీన ప్రక్రియ నిబంధనల మేరకు జరగాలని తేల్చిచెప్పింది. ఈ విషయంలో కోల్ కతా హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ అరవింద్ కుమార్ లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
కోల్ కతాలో పార్కు నిర్మాణం కోసం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఓ వ్యక్తి భూమిని స్వాధీనం చేసుకుంది. ఇందుకు అతడికి పరిహారం కూడా చెల్లించింది. అయితే, భూమిని ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు కోల్ కతా హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. ఆ భూమిని స్వాధీనం చేసుకోవడం చెల్లదని తీర్పునిచ్చింది. దీనిని మున్సిపల్ కార్పొరేషన్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం కోల్ కతా హైకోర్టు తీర్పునే సమర్థించింది. ఈ వ్యవహారంలో భూమి స్వాధీనం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని పేర్కొంది. నష్టపరిహారం చెల్లించినప్పటికీ.. భూమి స్వాధీనంలో అనుసరించాల్సిన విధానాలు పాటించలేదని వ్యాఖ్యానించింది.
వ్యక్తుల ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించినప్పటికీ, వాటికి రాజ్యాంగం తగిన రక్షణ కల్పిస్తోందని పేర్కొంది. భూ సమీకరణకు ముందు ఆ విషయాన్ని ముందుగా తెలియజేయడం, తగినంత సమయం ఇవ్వడం, అభ్యంతరాలు స్వీకరించడం, వాటిని పరిష్కరించడం, పునరావాసం కల్పించడం, ఆ భూ సేకరణ ప్రజోపయోగం కోసమేనని వివరించి ఒప్పించడం వంటివి ప్రభుత్వం చేయాల్సి ఉందని.. కానీ అవేవీ ఇక్కడ జరగలేదని ధర్యాసనం ప్రస్తావించింది. నిర్బంధ స్వాధీనాలు, హడావిడి నిర్ణయాలు, న్యాయబద్ధంగా లేని పరిహారాలతో ఎవరూ నష్టపోవడానికి చట్టం అంగీకరించదని స్పష్టంచేస్తూ.. కోల్ కతా మున్సిపల్ కార్పొరేషన్ పిటిషన్ ను కొట్టివేసింది.