ఇల్లు లాంటి ప్రదేశం మరొకటి ఉండదని అందరికీ తెలుసు. అందుకే, మన స్థలాన్ని కలల గృహంగా మార్చేందుకు కొంత సమయం మరికొంత కృషి అవసరం. ఇల్లంటే కేవలం ఫర్నిచర్, అలంకరణలు లేదా ఇంటీరియర్స్ గురించి మాత్రమే కాదు. మన ఇంటి తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టగానే మనసుకు ఆహ్లాదం కలగాలి. యువతను గిలిగింతలు పెట్టే నటి ప్రణీత ( Pranitha ) కూడా.. తను కలలు కనే సొంతిల్లు ఇలాంటి అద్భుతమైన అనుభూతిని అందించాలని కోరుకుంటోంది. ఆమె ఇంట్లోని ప్రతి ప్రాంతాన్ని తనదైన వినూత్న శైలిలో తీర్చిదిద్దాలని భావిస్తోంది. బాలీవుడ్లో హంగామా 2 తో సంచలనాలు సృష్టిస్తున్న ఈ అత్తారింటికి దారేది అమ్మాయి, భారీ స్థలాన్ని కొనుగోలు చేసి, నచ్చిన గృహాన్ని నిర్మించాలని ప్రణాళికల్ని రచిస్తోంది. ఆమె రియల్ ఎస్టేట్ గురుకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కలల గృహం గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. సారాంశం ఆమె మాటల్లోనే..
” నా ఇల్లంతా పచ్చగా కళకళలాడాలని నా కోరిక. ఎందుకంటే, ఇల్లు హరితమయంగా ఉంటేనే ఉల్లాసంగా ఉండొచ్చు. నా ఇంటికొచ్చే అతిథులు ఇల్లెంతో హాయిగా ఉందని చెబితే.. అదే నాకు పెద్ద అభినందన అని భావిస్తాను. నాకెంతో ఇష్టమైన పెట్ కోసమూ ఏదో ఒకటి చేస్తాను. ఎందుకంటే, దాంతో ఇంటి చుట్టూ పరుగెత్తుతున్నప్పుడు కలిగే సంతోషం అంతా ఇంతా కాదు. వినదం అంటే అదే కదా. నా ఇంటి డిజైన్లను ఎవరు చూసినా ప్రకృతి నుంచి ప్రేరణ పొంది డిజైన్ చేసినట్లు అర్థమవుతుంది. పచ్చటి ప్రపంచం నుండి పలు అంశాలను తీసుకొని.. వాటి సాయంతో నా కలల గృహాన్ని తీర్చిదిద్దితే సరికొత్త అనుభూతి కలుగుతుంది. చూడచక్కటి లాన్ వేసుకుంటే.. ప్రకృతితో మన జీవితం అనుసంధానం అయినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే, నేను బెంగళూరు నుండి వచ్చాను కాబట్టి, ఇక్కడి వాతావరణం ఎంత చల్లగా ఉంటుందో అందరికీ తెలుసు.
లండన్ శివార్లలో నాకు నచ్చేలా అందమైన కలల గృహాన్ని కట్టుకోవాలని ఉంది. నా వృత్తి కారణంగా ప్రపంచమంతా తిరుగుతాను. కాకపోతే, నాకంటూ ఓ ప్రత్యేక ఇల్లు ఉండాలి కాబట్టి, అది లండన్ లోనే ఉండాలని కోరుకుంటున్నాను. జీవితం అంటేనే కొత్త సాహసాలు.. దానికి అనుగుణంగానే సరికొత్త జీవన విధానం ఉండాలి. అందుకే, కలల గృహం కూడా నా ఆలోచనలకు తగ్గట్టుగానే ఉండేలా ప్రణాళికల్ని రచిస్తున్నాను”.