ప్రీలాంచ్ మోసాలు, ఇతరత్రా అంశాలతో రియల్ రంగంలో ఏది నిజం, ఏది కాదు అని భయపడే పరిస్థితులున్న ప్రస్తుత తరుణంలో మరో కొత్త తరహా అంశం తెర పైకి వచ్చింది. ఇప్పుడు రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే.. పదేళ్ల తర్వాత రూ.2 కోట్ల విలువైన ఫ్లాట్ ఇస్తారట. ఇందుకోసం ఓ కంపెనీ వినూత్న రీతిలో ప్రచారం కూడా ప్రారంభించింది. పది లక్షలకే రూ.2 కోట్ల ఫ్లాట్ కోసం ఆ కంపెనీ చెప్పే లాజిక్ ఏంటో తెలుసా?
30 మంది వ్యక్తులు తలా రూ.10 లక్షలు వేసుకుని నగరానికి బయట ఓ ఎకరం స్థలం కొనుక్కోవాలి. ఏడెనిమిదేళ్ల పాటు దానిని అలాగే వదిలేయాలి. అప్పటికి ఆ భూమి విలువ ఎంతో కొంత పెరుగుతుంది. అప్పుడు దానిని ఓ డెవలపర్ కి ఇస్తే.. దానిని అతడు ఉచితంగా డెవలప్ చేసి 30 మందికీ 1600 చదరపు అడుగుల ఫ్లాట్లు ఇస్తాడు. మిగిలినవాటిని అతడు అమ్ముకుంటాడు. అంటే మీకు రూ.10 లక్షలకే రూ.2 కోట్ల ఫ్లాట్ వచ్చేస్తుందన్న మాట. మీ సర్కిల్ లో 30 మంది లేకపోయినా పర్లేదు.. ఆ కంపెనీయే 30 మందిని వెతికి తీసుకొస్తుంది. డెవలపర్ ని కూడా తనే సమకూరుస్తుంది. అన్నీ చేసి ఫ్లాట్లు అప్పగించేలా చేస్తుంది. ఇదీ ఆ కంపెనీ చేసుకుంటున్న ప్రచారం. ఇప్పటికే ప్రీలాంచ్ మోసాలు పెరిగిపోతున్న తరుణంలో ఇది ఎంతవరకు నిజం అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే మీ రూ.10 లక్షలకు రెక్కలొచ్చినట్టే.