poulomi avante poulomi avante

ప్రీ లాంచ్.. ప‌చ్చి ద‌గా!

  • మూసాపేట్‌లో ఓ నిర్మాణ సంస్థ నిర్వాకం
  • జీహెచ్ఎంసీ, రెరా అనుమ‌తి లేకుండా అమ్మ‌కాలు
  • ముందే వంద శాతం సొమ్ము క‌డితే
    చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.4500కే ఫ్లాటు
  • ఇందులో కొనొచ్చా? లేదా? అంటూ
    రియ‌ల్ ఎస్టేట్ గురుని సంప్ర‌దిస్తున్న బ‌య్య‌ర్లు
  • పెరుగుతున్న ప్రీ లాంచ్ మోసాలు
  • ఈ మోసాల‌పై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి
  • హైద‌రాబాద్ మ‌రో నొయిడా, గుర్గావ్ అవుతుందా?

 

కింగ్ జాన్స‌న్ కొయ్య‌డ‌: నగరానికి చెందిన ఓ నిర్మాణ సంస్థ.. బడా మోసానికి తెరలేపింది. జీహెచ్ఎంసీ, రెరా అనుమతి తీసుకోకుండానే.. ప్రీ లాంచ్ సేల్ అంటూ కొనుగోలుదారుల్నుంచి వంద శాతం సొమ్మును అక్రమంగా వసూలు చేస్తోంది. ఓ బడా ఆర్కిటెక్చర్ సంస్థ నుంచి లేఅవుట్ ప్లాన్ తీసుకుని.. దాన్ని చూపెడుతూ.. నిర్మాణం ప్రారంభం కాక ముందే అమ్మేస్తోంది. 2016లో మొద‌లైన ఈ సంస్థ జ‌ర్నీ.. ప‌దేళ్ల‌లో టాప్ నిర్మాణ సంస్థ‌ల జాబితాలో చేరుకోవాల‌నే ల‌క్ష్యాన్ని నిర్దేశించుకుంది. కాక‌పోతే, ఇలా అక్ర‌మ బాట‌ను ఎంచుకోవ‌డం దారుణ‌మైన విష‌య‌మ‌ని నిర్మాణ వ‌ర్గాలు చెబుతున్నాయి.

మూసాపేట్లో ఓ సంస్థ చదరపు అడుక్కీ రూ.4500కే ఫ్లాట్లు అమ్ముతోందని.. ఇందులో ఫ్లాట్లు కొనవచ్చా.. కొంటే తమ సొమ్ముకు ఢోకా ఉంటుందా.. అంటూ కొందరు ఔత్సాహిక కొనుగోలుదారులు రియల్ ఎస్టేట్ గురుని సంప్రదించారు. బ్రోచర్ చూస్తేనేమో ఎక్కడా జీహెచ్ఎంసీ నుంచి కానీ రెరా అథారిటీ నుంచి కానీ అనుమతి ఉన్నట్లు కనిపించలేదు. ఆ బ్రోచర్లో పొందుపర్చిన వివరాల ప్రకారం.. 27 ఎకరాల స్థలం.. 22 అంతస్తుల ఎత్తులో 19 టవర్లు కడుతున్నట్లుగా ప్రకటించారు. ప్రపంచ స్థాయి సౌకర్యాలు.. హైరైజ్ ప్రీమియం అపార్టుమెంట్లు అంటూ.. చదరపు అడుక్కీ రూ.4500కే అమ్ముతున్నట్లుగా ఈ బ్రోచర్లో పేర్కొన్నారు. కాకపోతే, వంద శాతం సొమ్మును నెల రోజుల్లోపే కట్టాలనే నిబంధన విధించారు. ఇందులో వచ్చేవన్నీ ట్రిపుల్, ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్లే కావడం గమనార్హం. అంటే, ఓ ట్రిపుల్ బెడ్రూమ్ సైజ్ ఫ్లాట్ కొనాలంటే ఎంతలేదన్నా కోటి రూపాయలు అవుతోంది. మరి, కోటి రూపాయల్ని ఓకేసారి కట్టేసి.. అంతంత కాలం ఎదురు చూడొచ్చా అని కొనుగోలుదారులు ప్రశ్నిస్తున్నారు. మ‌రి, వీరి ప్రశ్నలకు జవాబు చెప్పేదెవరు? స‌కాలంలో ఫ్లాట్ల‌ను అందించ‌క‌పోతే ఎలా?

తెలంగాణ రాష్ట్రంలో రెరా చ‌ట్టం అమ‌ల్లో ఉంది. దీని ప్ర‌కారం.. రెరా నుంచి అనుమ‌తి తీసుకున్నాకే ఎవ‌రైనా ప్లాట్లు కానీ ఫ్లాట్లు కానీ విక్ర‌యించాలి. రెరా అనుమ‌తి లేకుండా క‌నీసం ఒక బ్రోచ‌ర్ ని కూడా ముద్రించ‌కూడ‌దు. పైగా, బ్రోచ‌ర్ అయినా పేప‌ర్ ప్ర‌క‌ట‌న అయినా త‌ప్ప‌కుండా రెరా నెంబ‌ర్‌ను ముద్రించాలి. కానీ, కొంద‌రు బిల్డ‌ర్లు రెరాను తుంగ‌లో తొక్కేసి.. గాలిలో మేడల్ని చూపెడుతూ.. ప్రీ లాంచ్ అంటూ.. అక్ర‌మ ప‌ద్ధ‌తిలో ఫ్లాట్ల‌ను అమాయ‌కుల‌కు అంట‌గ‌ట్టేస్తున్నారు. కార్పొరేట్ ఏజెంట్ల సాయంతో ఫ్లాట్ల‌ను విక్ర‌యించే విష‌సంస్కృతికి తెర‌లేపారు. ఇలాంటి పోక‌డ వ‌ల్ల ఢిల్లీలోని గుర్గావ్‌, నొయిడాలో వంద‌లాది మంది కొనుగోలుదారులు ప్ర‌స్తుతం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. దిగ్గ‌జ్జ‌ల్లాంటి డెవ‌ల‌ప‌ర్లు జైలులో ఊచ‌లు లెక్క‌పెడుతున్నారు. అదే వికృత పోక‌డను తెలంగాణ రాష్ట్రంలో కొంద‌రు బిల్డ‌ర్లు ఆరంభించారు. మార్కెట్లో పెరిగిన ధ‌ర‌ను సాకుగా చూపెడుతూ.. ఏజెంట్ల‌కు అధిక శాతం క‌మిష‌న్ ముట్ట‌చెబుతూ.. ముందే వంద శాతం సొమ్మును లాగేస్తున్నారు. గ‌త మూడేళ్ల నుంచి హైదరాబాద్‌లో య‌ధేచ్చ‌గా సాగుతున్న అక్ర‌మ విధానానికి చ‌ర‌మ‌గీతం పాడాలి. ఇలాంటి అక్ర‌మ ప‌ద్ధ‌తిలో ఫ్లాట్ల‌ను అమ్మే విధానంపై ప్ర‌భుత్వం కొర‌డా ఝ‌ళిపించాలి. లేక‌పోతే, ఇలాంటి మోసాలు పెరిగిపోయి హైద‌రాబాద్ ప్ర‌తిష్ఠ‌కు భంగం వాటిల్లే ప్ర‌మాద‌ముంది.

ప్ర‌త్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు..

హైద‌రాబాద్ నిర్మాణ రంగంలో అనూహ్య‌మైన ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. చోటా మోటా రియ‌ల్ట‌ర్లు, మ‌ధ్య‌వ‌ర్తులు, కంట్రాక్ట‌ర్లు, స్థ‌ల య‌జ‌మానులు వంటివారు బిల్డ‌ర్లుగా అవ‌తారం ఎత్తుతున్నారు. జూనియ‌ర్ ఆర్కిటెక్ట్‌ల‌ను సంప్ర‌దించి.. ఇష్టం వ‌చ్చిన‌ట్లు డ్రాయింగులు వేయించుకుని.. వాటిని అమ్మ‌కానికి పెడుతున్నారని ఓ ప్ర‌ముఖ‌ ఆర్కిటెక్ట్ రియ‌ల్ ఎస్టేట్ గురుకి తెలిపారు. ఇలాంటి వికృత పోక‌డ వ‌ల్ల అంతిమంగా ఇబ్బంది ప‌డేది కొనుగోలుదారులేన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

నొయిడా, గుర్గావ్ త‌ర‌హాలో హైద‌రాబాద్ మార‌కూడ‌దంటే.. ఇలాంటి అక్ర‌మ వ్య‌వ‌హారాల‌పై ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాలి. ప్ర‌త్యేక ముఖ్య కార్య‌ద‌ర్శి అర‌వింద్ కుమార్ నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ క‌మిటీ ఏర్పాటు చేయాలి. ఇందులో స‌భ్యులుగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ క‌మిష‌న‌ర్లు, రెరా స‌భ్య కార్య‌ద‌ర్శి, ప్లానింగ్ విభాగం ఉన్న‌తాధికారులు, నిర్మాణ సంఘాల అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు ఉండాలి. ప్రీ లాంచులు లేదా యూడీఎస్‌లో ప్లాట్లు, ఫ్లాట్ల‌ను విక్ర‌యించేవారి జాబితాను సేక‌రించాలి. వాటికి అనుమ‌తుల్ని నిలిపివేయాలి. ఇలా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తే త‌ప్ప ప్రీ లాంచ్, యూడీఎస్ అమ్మ‌కాల్ని నిరోధించ‌లేరు.
spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles