ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద నాసిరకంగా నిర్మించిన ఇళ్లలో ఏడాదికే బోలెడు సమస్యలు వెలుగుచూశాయి. వర్షపునీరు కారడం, విద్యుత్ షాకులు తగలడం వంటి తీవ్రమైన సమస్యలు కూడా ఉన్నాయి. నాగ్ పూర్ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథార్టీ (ఎన్ఎంఆర్డీఏ) నిర్మించిన ఇళ్లలో ఈ సమస్యలు బయటపడ్డాయి. ఈ ఇళ్ల లబ్ధిదారులు ఫ్లాట్ కు రూ.7 లక్షలు, నిర్వహణకు రూ.25వేల చొప్పున చెల్లించారు. పీఎంఏవై కింద ఖస్రాలో 942 ఫ్లాట్లను ఎన్ఎంఆర్డీఏ నిర్మించింది. జీ ప్లస్ 4 అంతస్తులతో మొత్తం 48 భవనాలు నిర్మించింది.
ఇప్పటివరకు 450 ప్లాట్లకు అప్పగించగా.. 320 ఫ్లాట్లు ఆక్యుపై అయ్యాయి. అయితే, ఏడాది తిరగకుండానే పలు సమస్యలు చుట్టుముట్టాయి. ప్రధానంగా వర్షపు నీరు లోపలకు రావడం చాలా తీవ్రమైన అంశమని లబ్ధిదారులు వాపోతున్నారు. అలాగే కొన్ని బ్లాకుల్లో ఎర్తింగ్ చేయకపోవడం వల్ల విద్యుదాఘాతాలు సంభవిస్తున్నాయని చెప్పారు. అలాగే కొన్ని ఫ్లాట్లలోకి నీళ్లు సరిగా రావడంలేదని వివరించారు. కాగా, దీనిపై ఎన్ఎంఆర్డీఏ స్పందించింది. అన్నీ పరిశీలించిన తర్వాత సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది.
This website uses cookies.