Categories: LATEST UPDATES

సుడా పరిధిలో అక్రమాలు

  • 50 ఎకరాల గ్రీన్ బెల్ట్ మాయం

ఖమ్మంలోని స్తంభాద్రి అర్బన్ డెవలప్ మెంట్ అథార్టీ (సుడా) పరిధిలోని రియల్ ఎస్టేట్ వెంచర్లలో అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గ్రీన్ బెల్ట్ కోసం నిర్దేశించిన స్థలాలను సైతం ఇష్టారీతిన విక్రయిస్తున్నారు. దాదాపు రూ.50 కోట్ల విలువైన 50 ఎకరాల గ్రీన్ స్పేస్ ను నివాస స్థలాలుగా చూపించి రిజిస్టర్ చేసేశారు. సుడా పరిధిలోని 55 వెంచర్లలో ఇలాంటి అక్రమాలు చోటుచేసుకున్నాయని సమాచారం. ఈ అక్రమాలపై అధికారులు చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లోని ఏడు మండలాల్లో 46 గ్రామాలు, 60 వార్డుల్లో సుడా విస్తరించి ఉంది.

ఇందులోని కొన్ని వెంచర్ల యజమానులు నిబంధనలు ఉల్లంఘించి రిజర్వుడు భూములను విక్రయించారని చెబుతున్నారు. రోడ్ల కోసం చూపించిన స్థలాలను సైతం అమ్మేశారని అంటున్నారు. 2014 నుంచి 2018 వరకు వేసిన వెంచర్లలో కేవలం 16.34 ఎకరాల్లో మాత్రమే గ్రీన్ బెల్ట్ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దాదాపు 20 ఎకరాల గ్రీన్ బెల్ట్ భూమి కనిపించకుండా పోయిందని నిర్ధారించారు. అనంతరం 2019 నుంచి సుడా పరిధిలో 248 రియల్ వెంచర్లు వెలిశాయి. వీటిలో 370 ఎకరాలు గ్రీన్ బెల్ట్ ఏరియా ఉండాలి. కానీ 20 ఎకరాలు కనిపించడం లేదు.

This website uses cookies.