రియల్ ఎస్టేట్ రంగంలో మిలీనియల్స్ ఇరగదీస్తున్నారు. ప్రాపర్టీ కొనుగోళ్లలో వారి హవా గణనీయంగా పెరుగుతోంది. 25-35 ఏళ్ల మధ్య వయసున్న కొనుగోలుదారుల సంఖ్య 23 శాతం పెరిగినట్టు ప్రాపర్టీ సెర్చ్ పోర్టల్ నో బ్రోకర్ పేర్కొన్నట్టు ప్రాప్ టెక్ యూనికార్న్ తన అర్ధ వార్షిక నివేదికలో తెలిపింది. ప్రాపర్టీ పోర్టల్‌లోని మొత్తం కొనుగోలుదారుల్లో 45 ఏళ్లలోపు వారు 57 శాతం మంది ఉన్నారు. ‘వారు ఆస్తి యాజమాన్యాన్ని అతిపెద్ద మైలురాయిగా చూడరు.. కానీ జీవితం తొలినాళ్లలోనే సంపదను నిర్మించడానికి ప్రాపర్టీలను ఓ సాధనంగా చూస్తున్నారు’ అని నివేదిక పేర్కొంది. ఈ యువ గృహ కొనుగోలుదారుల్లో చాలామంది ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నారని, అలాగే న్యూక్లియర్ ఫ్యామిలీ కలిగి ఉన్నారని పేర్కొంది.
నో బ్రోకర్ సర్వేలో పాల్గొన్న 11వేల మందిలో 67 శాతం మంది రెండు ఆదాయాలు వచ్చే కుటుంబాలకు చెందినవారే ఉన్నారు. మిలీనియల్స్ లో 1 బీహెచ్ కే, 3 బీహెచ్ కే యూనిట్లకే డిమాండ్ ఎక్కువగా ఉంది.. తద్వారా 2 బీహెచ్ కేలకు ఉన్న డిమాండ్ ను వీరు అధిగమిస్తున్నారని నివేదిక వెల్లడించింది. సర్వేలో పాల్గొన్నవారిలో 39 శాతం మంది 1 బీహెచ్ కే కొనుగోలు చేయాలని చెప్పగా.. 3 బీహెచ్ కే కోసం 33 శాతం చూస్తున్నట్టు వెల్లడించారని పేర్కొంది. ఈ సర్వేలో బెంగళూరు, ముంబై, పుణె, హైదరాబాద్, చెన్నై, ఢిల్లీకి చెందిన మిలీనియల్స్ పాల్గొన్నారు. అలాగే ప్రాపర్టీ కొనుగోలులో లొకేషన్ తమక అత్యంత కీలకమైన అంశమని 49 శాతం మంది పేర్కొన్నారు.
రియల్ రంగంలో ఏకైక యజమాని లేదా సహ యజమానిగా పెట్టుబడి పెట్టడానికి 32 శాతం మంది మహిళలు ఆసక్తి కనబరుస్తున్నారు. వృత్తి, వ్యవస్థాపకత ద్వారా ఆర్థిక స్వాతంత్రం సాధించడం వల్ల మహిళా యాజమాన్యం పెరుగుతోందని నివేదిక పేర్కొంది. మరోవైపు నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీలను కొనుగోలు చేయాలని చూస్తున్నట్టు 60 శాతం మంది వెల్లడించారు. కాగా, మనదేశంలో సగటు అద్దె ద్రవ్యోల్బణం వార్షిక జీతాల పెంపును కూడా మించిపోయిందని.. ఇది అద్దెదారులకు సవాల్ గా మారిందని నివేదిక పేర్కొంది. అదే సమయంలో ఈ పరిస్థితులు ఇంటి కొనుగోలు నిర్ణయం వైపు అడుగులు వేయిస్తున్నాయని వ్యాఖ్యానించింది. అలాగే కొనుగోలుదారుల ప్రాధాన్యతలు మారుతుండటంతో రియల్ ఎస్టేట్ డెవలపర్లు కూడా అందుకు అనుగుణమైన ప్రాజెక్టులు చేపడుతున్నారని తెలిపింది.
This website uses cookies.