3 నుంచి 49 శాతం మేర పెరిగిన ప్రాపర్టీ రేట్లు
భారీగా కొనుగోళ్లు జరుపుతున్న పెట్టుబడిదారులు
పెరిగిన ధరలతో అష్టకష్టాలు పడుతున్న అసలు కొనుగోలుదారులు
సామాన్యుడి సొంతింటి కల అలాగే మిగిలిపోతోంది. అంతకంతకూ పెరుగుతున్న ప్రాపర్టీ రేట్లే ఇందుకు ప్రధాన కారణం. రియల్ ఎస్టేట్ కీలకమైన వ్యాపారంగా మారిపోయిన తరుణంలో సామాన్యుల సొంతింటి ఆకాంక్ష అలాగే ఉండిపోతోంది. రియల్ మార్కెట్లో లాభాలు భారీగా ఉండటంతో చాలామంది పెట్టుబడిదారులు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫలితంగా నిజమైన ఇళ్ల కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. వెల్లువలా వస్తున్న పెట్టుబడిదారులతో ధరలు కూడా అదే రీతిలో పెరిగిపోతున్నాయి. దీంతో సామాన్య కొనుగోలుదారులకు ఇల్లు కొనడం అనేది శక్తికి మించిన భారంగా మారుతోంది. గుర్గావ్, నోయిడా వంటి మైక్రో మార్కెట్లో వార్షిక ప్రాతిపదికన ఇళ్ల రేట్లు 20 శాతం మేర పెరిగాయి. అదే సమయంలో కొత్త లాంచింగులు తగ్గాయి. దీంతో ప్రాపర్టీ ధరలు కిందకు దిగి రాకపోవడంతో కొనుగోళ్లు కూడా తగ్గుముఖం పట్టాయి.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రాపర్టీ రేట్లు 3 శాతం నుంచి 49 శాతం మేర పెరిగినట్టు హౌసింగ్ డాట్ కామ్ సీఈఓ ధ్రువ్ అగర్వాలా తెలిపారు. అత్యధికంగా ఢిల్లీలో 49 శాతం మేర ఆస్తి ధరలు పెరగ్గా.. హైదరాబాద్ లో 3 శాతం పెరుగుదల కనిపించినట్టు వివరించారు. ‘ప్రాపర్టీ ధరల పెరుగుదల నిరంతరాయంగా కొనసాగుతుండటంతో సహజంగానే పెట్టుబడిదారుల చూపు ఇటువైపు పడుతుంది. దీంతో వారు ఇక్కడ కొనుగోళ్లకు ఆసక్తి కనబరుస్తారు. ఇది రేట్లు మరింత పెరగడానికి కారణమవుతుంది. ఈ పరిణామాలన్నీ నిజంగా ఇల్లు కొనుక్కోవాలని భావించే వారికి ఆశనిపాతంగా మారుతున్నాయి. వారు తమ శక్తికి మంచి డబ్బులు వెచ్చించాల్సిన పరిస్థితి వస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే నిజమైన ఇళ్ల కొనుగోలుదారులు ఇల్లు కొనే పరిస్థితే ఉండదు. త్వరలోనే ఆ పరిస్థితి వస్తుంది’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో ఇళ్ల అమ్మకాల్లో మిశ్రమ స్పందన కనిపించింది. తొలి త్రైమాసికంతో పోలిస్తే.. రెండో త్రైమాసికంలో తగ్గుదల నమోదైంది.
రెండున్నరేళ్ల తర్వాత తొలిసారిగా ఇళ్ల అమ్మకాల్లో తగ్గుదల కనిపించినట్టు అనరాక్ డేటా వెల్లడించింది. ముఖ్యంగా ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కొనుగోళ్లు తగ్గాయి. జనవరి-మార్చి త్రైమాసికంలో 1,30,340 యూనిట్లు అమ్మడుకాగా, జూన్ త్రైమాసికంలో 8 శాతం తగ్గి 1,20,340 ఇళ్లు మాత్రమే అమ్ముడయ్యాయని అనరాక్ పేర్కొంది. హైదరాబాద్, కోల్ కతా, బెంగళూరు, చెన్నై, పుణె, ముంబైల్లో తగ్గుదల నమోదైంది. ఇక హౌసింగ్ డాట్ కామ్ డేటాను పరిశీలిస్తే.. క్యూ1లో 1,20,642 ఇళ్లు అమ్ముడుకాగా, క్యూ2లో అది 6 శాతం మేర తగ్గి 1,13,768 యూనిట్లకు పరిమితమైంది. అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, కోల్ కతా, పుణె, ముంబైల్లో తగ్గుదల నమోదైంది. ఢిల్లీ, బెంగళూరుల్లో మాత్రం కాస్త పెరుగుదల కనిపించింది. కాగా, గత త్రైమాసికంలో జరిగిన మొత్తం అమ్మకాల్లో రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉన్న యూనిట్లు 40 శాతం మేర ఉండటం విశేషం. ఇక గత నెలలో గుర్గావ్ లో ఓ ప్రాజెక్టు లాంచ్ చేసిన వెంటనే గంటల్లోనే అందులోని ప్లాట్లు అన్నీ బుక్ అయిపోయాయి.
ఎన్నారైలు, అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు తమ పెట్టుబడులకు గుర్గావ్ ను ఎంచుకోవడమే ఇందుకు కారణం. మరోవైపు కొత్త లాంచులు కాస్త తగ్గాయి. హౌసింగ్ డాట్ కామ్ ప్రకారం జనవరి-మార్చి త్రైమాసికంలో 1,03,020 కొత్త యూనిట్లు లాంచ్ కాగా, జూన్ త్రైమాసికంలో ఒక శాతం తగ్గి 1,01,677 యూనిట్లు మాత్రమే లాంచ్ అయ్యాయి. హైదరాబాద్ లో అత్యధికంగా 58 శాతం మేర క్షీణత నమోదు కాగా, కోల్ కతాలో 49 శాతం మేర తగ్గుదల కనిపించింది. చెన్నైలో 2 శాతం తగ్గగా.. పుణెలో 11 శాతం తగ్గుదల కనిపించింది. అహ్మదాబాద్ లో 110 శాతం, ఢిల్లీలో 17 శాతం, బెంగళూరులో 26 శాతం, ముంబైలో 10 శాతం మేర లాంచులు పెరిగాయి.