అనుసంధానమయ్యేనా?
రూ.10 వేల కోట్లు ఖర్చు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మూసీ సుందరీకరణ గురించి ప్రభుత్వాలు ఎన్నో ప్రణాళికలు ప్రకటించాయి. కానీ, ఏ ఒక్కటి కార్యరూపం దాల్చలేదు. ఇక, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ శుద్ధిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏకంగా లక్ష కోట్ల రూపాయలను మూసీ ప్రక్షాళన, సుందరీకరణ కోసం ఖర్చు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే హైదరాబాద్ లో మూసీ నదిలోకి గోదావరి నీటిని తరలించి ప్రక్షాళన చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది.
గోదావరితో మూసిని అనుసంధానం చేయడానికి.. ఇప్పటికే ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద రేవంత్ సర్కార్ కేంద్రానికి దరఖాస్తు చేసింది. అది వీలుకాకపోతే, ఇంట్రా స్టేట్ రివర్ లింకింగ్ కిందనైనా మూసీని ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం సమాలోచన చేస్తోంది. మూసీ ప్రక్షాళనలో భాగంగానే కేంద్రం నుంచి లబ్ధి పొందేందుకు పీఎంకేఎస్వై కింద ప్రాజెక్టుకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది. అయితే దీని కింద కేంద్రం నుంచి సాయం పొందడం అంత సులువేం కాదని సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ స్కీమ్ కింద ప్రాజెక్టు మంజూర్ కావాలంటే సవాలక్ష కండిషన్లు ఉంటాయని, వాటన్నింటినీ తెలంగాణ ప్రభుత్వం కచ్చితంగా నెరవేర్చాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఒకవేళ అన్ని నిబంధనలను తప్పకుండా ఫాలో అయినా కేంద్రం నుంచి అనుమతులు వచ్చేందుకు కొంత సమయం పడుతుంది.
కేంద్ర ప్రభుత్వం ఇంటర్ స్టేట్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ తెలంగాణలో గోదావరి –కావేరి నదుల అనుసంధానానికి సంబంధించిన ప్రాజెక్టును చేపట్టింది. అందులో భాగంగా సమ్మక్కసాగర్ బ్యారేజీ నుంచి నీటిని తీసుకుని సగం వాటా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇంట్రా లింకింగ్ కింద గోదావరి –మూసీ నదుల అనుసంధానాలపైన కేంద్ర ప్రభుత్వ సహకారం కోరుతున్నట్లు తెలుస్తోంది. పీఎంకేఎస్వై పధకం క్రింద అనుమతులు రాకుంటే ఇంట్రా లింకింగ్ కిందనైనా అనుమతులు తీసుకురావాలన్న ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం. పీఎంకేఎస్వైతో పోలిస్తే ఇంట్రా లింకింగ్ ప్రాజెక్టుల్లో షరతులు తక్కువగా ఉండడం కలిసివస్తుందని అధికారులు భావిస్తున్నారు. దేశంలో ఇలాంటి నదుల అనుసంధానానికి సంబంధించి మొత్తం 14 ప్రతిపాదనలు రాగా.. అందులో 8 ప్రాజెక్టులను పరిశీలించి.. వాటి అవసరాలకు అనుగుణంగా ఇంట్రా లింకింగ్ కు అనుమతులిచ్చింది కేంద్ర ప్రభుత్వం.
ఇటీవల గోదావరి కావేరి ఇంటర్ లింకింగ్ పై జరిగిన ఎన్డబ్ల్యూడీఏ సమావేశంలో అధికారులు కేంద్ర జలశక్తి శాఖ అధికారులకు గోదావరి-మూసీ అనుసంధానంపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనను పెట్టినట్టు తెలుస్తోంది. అందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులు సైతం సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్టు సమాచారం. ముందుగా గోదావరి కావేరి లింకింగ్ ప్రాజెక్ట్ కు సంబంధించిన అంశాలను పరిష్కరించుకుని, ఆ తరువాత గోదావరి-మూసి ప్రాజెక్టుపై ముందుకెళ్ధామని కేంద్ర ప్రభుత్వ అధికారులు అభిప్రాయపడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మూసీ శుద్ధి, సుందరీకరణలో భాగంగా గోదావరి నీటితో మూసీని నింపాలన్న ఆలోచనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కనీసం రూ.10 వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని రాబట్టాలని తెలంగాణ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని అధికార వర్గాల సమాచారం. గోదావరి నీటిని మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలకు తరలించి మూసీలోకి వదిలేలా సర్కారు ప్రణాళికల్ని సిద్దం చేస్తోంది.