(కింగ్ జాన్సన్ కొయ్యడ, సిడ్నీ)
భారతదేశంలోని సుమారు ఏడు కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులను.. ఈఎస్ఐసీ, ఈపీఎఫ్ పరిధిలోకి తేవాలని కేంద్ర మంత్రి పియుష్ గోయల్ సూచించారు. అప్పుడే నిర్మాణ రంగం పరిశ్రమ క్రెడిబిలిటీ భారతదేశంలో పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. దీంతో కార్మికులకు పూర్తి స్థాయి ఆరోగ్య భద్రతను అందించడంతో పాటు వృద్ధాప్యంలో పెన్షన్ ఇచ్చేందుకు అవకాశం లభిస్తుందని చెప్పారు. మంగళవారం సిడ్నిలోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లోని క్రెడాయ్ నాట్‌కాన్ 2024 కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ప్రతిపాదించిన వికసిత్ భారత్ 2047 కార్యక్రమానికి రియల్ ఎస్టేట్ రంగం వెన్నెముక్క వంటిదని ఆయన అభివర్ణించారు. పాశ్చాత్య దేశాలన్నీ భారతదేశం వైపు దృష్టి సారించేలా దేశీయ నిర్మాణ రంగం ఎదగాలని కేంద్రమంత్రి పియూష్ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్‌బీఐతో మాట్లాడి నిర్మాణ రంగానికి ఇండస్ట్రీ స్టేటస్ ను అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.
* నిర్మాణాలకు ఇచ్చే అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడంలో కృషి చేస్తానని తెలిపారు. భారత నిర్మాణ రంగం ఎదుర్కొనే సమస్యలను పరిష్కారంపై దృష్టి సారిస్తానని అన్నారు. భారతదేశంలోని 10-12 నగరాల్లో అంతర్జాతీయ స్థాయిలో కన్వెన్షన్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికల్ని రచిస్తున్నామని వెల్లడించారు. భారతమండపం, యశోభూమిని అంతర్జాతీయ స్థాయిలో వైబ్రెంట్ సెంటర్లుగా డెవలప్ అవుతున్నాయని తెలిపారు. న్యూయార్క్, లండన్ వంటి నగరాలు కొన్నేళ్ల క్రితం డెవలప్ అయ్యాయని.. ఇప్పుడా నగరాలు రీ-కన్‌స్ట్రక్షన్ కోసం ఇండియావైపు తిరిగి చూసే స్థాయిలో భారతదేశం అభివృద్ధి చెందాలని అభిలషించారు. కాలుష్యాన్ని తగ్గించేలా నిర్మాణాల్ని చేపట్టేందుకు స్టీల్ స్ట్రక్చర్ల వైపు దృష్టి సారించాలని సూచించారు. ఇందుకోసం అత్యుత్తమ నాణ్యత గల ఎక్విప్‌మెంట్ భారతదేశంలో తయారు కావాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఏయే వస్తువుల్ని ఉత్పత్తి చేయాలో అందుకు సంబంధించిన జాబితాను సిద్ధం చేసివ్వాలని తెలిపారు. ఈ సందర్భంగా క్రెడాయ్ విమెన్ వింగ్ రూపొందించిన వైట్ పేపర్ ను ఆయన విడుదల చేశారు.
* అంతకంటే ముందు క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ మాట్లాడుతూ.. సిడ్నీ నగరాన్ని చూస్తే ఆశ్చర్యమేసిందని.. ఇక్కడి రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్‌ని గమనిస్తే.. హైవే కింద స్టార్ హోటల్స్, రెస్టారెంట్స్, గ్రీన్ స్పేసెస్ అతిసుందరగా డిజైన్ చేశారని కితాబునిచ్చారు. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరేందుకు కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే పట్టేవిధంగా.. ఇక్కడి మౌలిక సదుపాయాల్ని డెవలప్ చేశారని తెలిపారు. సిడ్నీ నగరాన్ని చూస్తే లివబిలిటీకి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యూసీఐ ఛైర్ పర్సన్ జక్సేషా, క్రెడాయ్ సెక్రటరీ గుమ్మి రాంరెడ్డి, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ సీఎండీ ఇర్ఫాన్ రజాక్ తదితరులు పాల్గొన్నారు.
This website uses cookies.