క్యూ కాన్ వాల్స్ .. విదేశాల్లోని కొన్ని భవనాల్ని చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. అంత ఎత్తు వరకూ ఎలా కట్టారు? గట్టిగా గాలి వస్తే నిర్మాణం పడిపడదా? అన్న సందేహం సామాన్యులకు కలుగుతుంది. అయినా, అంతంత ఎత్తులో అలా ఎలా నిర్మించగలిగారు అనే ప్రశ్న మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కానీ, మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఆ తరహా నిర్మాణాల్ని సంప్రదాయ పద్ధతిలో నిర్మించరు. శ్లాబు, స్ట్రక్చర్, గోడలన్నీ క్యూ కాన్ వాల్స్ సాయంతో కడతారు. ఇంతకీ, క్యూ కాన్ గోడలంటే ఏమిటి?
గోడల క్యూరింగ్ త్వరగా అవ్వాలి.. నిర్మాణాల్ని వేగంగా పూర్తి చేయాలి.. ఒకవైపు కార్మికుల కొరత మరోవైపు అదనపు భారం.. ఇలాంటివన్నీ తట్టుకుని నిర్మాణాల్ని కట్టేందుకు తోడ్పడుతుంది క్యూ కాన్ వాల్స్. ఐటీ కట్టడాలు.. పారిశ్రామిక కట్టడాలు.. వాణిజ్య భవనాలు.. వంటివి వేగంగా పూర్తి చేయాలని భావించేవారికి.. క్యూ కాన్ వాల్స్ చక్కగా పనికొస్తాయి. సిమెంట్, జిప్సం, అల్యూమినియం వంటి వాటితో ఈ వ్యాల్ ప్యానెళ్లను తయారు చేస్తారు. ఈ తరహా గోడలు 600 ఎంఎం నుంచి ఆరు మీటర్ల పొడవు వరకూ లభిస్తుంది. అంటే, ఒకట్రెండు అంతస్తులైనా సులువుగా వేసేయవచ్చన్నమాట. కాకపోతే, ప్రస్తుతం రెండు అంతస్తుల పొడవు గోడల్ని సరఫరా చేయడం కష్టం కాబట్టి, ఒక అంతస్తు ఎత్తులో ఉండే గోడల్ని సరఫరా చేస్తారు.
కాకపోతే, ఒక దాని మీద మరో ప్యానెల్ బిగించి రెండు అంతస్తుల ఇంటిని కట్టుకోవచ్చు. మందం విషయానికి వస్తే.. 75 ఎంఎం, 100 ఎంఎం, 125 ఎంఎం, 150 ఎంఎం, 200 ఎంఎం వంటి సైజుల్లో లభిస్తాయి. నివాస సముదాయాల్లో అయితే అంతర్గత గోడల కోసం 75 ఎంఎం మందం గల గోడ కడితే సరిపోతుంది. ఎక్స్‌టర్నల్ గోడలకు 100 ఎంఎం మందం చాలు.
ఎక్కడ బిగించొచ్చు?
క్యూ కాన్ గోడలు, శ్లాబులు వంటివి దొరకుతున్నాయి. కాకపోతే, హైదరాబాద్‌లో ప్రస్తుతం కేవలం గోడల్ని మాత్రమే సంస్థ అందేస్తోంది. భవనం లోపల, బయట. నివాస గృహాలు, వ్యాపార, కర్మాగార, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, పారిశ్రామిక భవనాలు.. ఇలా ఎక్కడైనా సంప్రదాయ గోడల స్థానంలో క్యూ కాన్ గోడల్ని వాడొచ్చు. సాధారణ పద్ధతిలో గోడల్ని కట్టాల్సి వస్తే.. నిర్మాణానికి అధిక సమయం పడుతుంది. శ్లాబు వేసి గోడలు కట్టిన తర్వాత క్యూరింగ్ కోసం అధిక సమయం వెచ్చించాల్సి ఉంటుంది. కాకపోతే, ఇక్కడ అలాంటి ఇబ్బందేం లేదు. క్యూ కాన్ గోడల్ని అతి వేగంగా కట్టవచ్చు. వీటిని బిగించాక ప్లాస్టరింగ్ చేస్తే పగుళ్లు రానే రావు. అంతర్గత గోడలైతే నేరుగా ఈ గోడల్ని బిగించి, పుట్టిపెట్టేసి రంగు వేస్తే సరిపోతుంది. చూడటానికి ఎంతో చక్కగా కనిపిస్తుంది.
ధర అంటారా?
75 ఎంఎం గోడలు కావాలంటే.. చదరపు అడుక్కీ రూ.145 దాకా ఖర్చవుతుంది. 100 ఎంఎం గోడలకు రూ.195, 150 ఎంఎం రకానికి రూ.305, 200 ఎంఎంకి రూ.390 దాకా పెట్టాల్సి ఉంటుంది. జీఎస్టీ, బిగించేందుకు ఛార్జీలు అదనం. ఈ వస్తువు థాయ్ లాండ్ నుంచి రావాలి కాబట్టి, డెలివరీ కోసం సుమారు రెండు నెలలైనా పడుతుంది. 75 ఎంఎం సైజు గల క్యూ కాన్ వాల్స్ కనీసం 2000 చదరపు అడుగుల ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్యానళ్లు థాయ్ ల్యాండ్ నుంచి ఇండియాలోని ఏ ప్రాంతానికైనా చేరడానికి అంత సమయం పడుతుంది. అతిత్వరలో ఇక్కడే ప్లాంటును ఏర్పాటు చేసేందుకు సంస్థ ప్రయత్నాల్ని ముమ్మరం చేసిందని సమాచారం.
26 ఏళ్ల నుంచి..
ఈ వ్యాపారంలో 26 ఏళ్ల నుంచి ఉన్నాం. అప్పట్నుంచి మార్కెట్లో కొత్త కొత్త ఉత్పత్తుల్ని పరిచయం చేశాం. ప్రస్తుతం థాయ్ ల్యాండ్‌కి చెందిన క్యూ కాన్ వాల్స్ హైదరాబాద్ మార్కెట్‌కు పరిచయం చేశాం. మన వద్ద వీటికి మంచి ఆదరణ ఉంటుంది. ఎందుకంటే ఇవి తక్కువ కార్మికులతో ఎక్కువ పని తక్కువ సమయం లో చెయ్యవచ్చు. అదే ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ కోరుకునేది.- వల్లీనాథ్, అధినేత, తోలేటీ ప్రాడక్ట్స్