Categories: LATEST UPDATES

స్టాంపు డ్యూటీ రాయితీ రాజస్థాన్ బిల్డర్ల హర్షం

రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చూస్తే సంతోషమేస్తుంది. రూ.50 లక్షల్లోపు బహుళ అంతస్తుల ప్రాజెక్టులపై 2 శాతం స్టాంపు డ్యూటీని తగ్గింపును.. వచ్చే ఏడాది మార్చి 31 దాకా పెంచింది. ఈ నిర్ణయం పట్ల అక్కడి బిల్డర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల చాలామందికి లబ్ధి కలుగుతుందని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి తర్వాత అశోక్ గెహ్లాట్ సర్కారు ప్రవేశపెట్టే బడ్జెట్ పై రియల్ ఎస్టేట్ రంగం భారీగానే ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం రాజస్థాన్ శాసనసభలో గెహ్లాట్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా స్టాంపు డ్యూటీ రాయితీని వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది.

‘స్టాంపు డ్యూటీ రాయితీ వచ్చే ఏడాది వరకు పొడిగించడం వల్ల చాలామంది లబ్ధి పొందుతారు. కరోనా కారణంగా చాలామంది ఇళ్ల కొనుగోలును వాయిదా వేసుకున్నారు. అలాంటివారికి ప్రభుత్వం నిర్ణయం వల్ల లబ్ధి చేకూరుతుంది’ అని క్రెడాయ్ మాజీ చైర్మన్ గోపాల్ దాస్ గుప్తా పేర్కొన్నారు. అలాగే జిల్లా లీజ్ కమిటీ(డీఎల్సీ) రేట్ల తగ్గింపును కూడా డెవలపర్లు స్వాగతించారు. వెయ్యి చదరపు మీటర్ల నుంచి 2000 చదరపు మీటర్ల విస్తీర్ణం కలిగి ప్లాట్ల డీఎల్సీ రేట్లపై 5 శాతం రాయితీ, 2వేల చదరపు మీటర్ల నుంచి 3వేల చదరపు మీటర్ల ప్లాట్లపై 10 శాతం తగ్గింపును ప్రభుత్వం ప్రకటించింది.

3వేల చదరపు మీటర్లకు పైబడిన ప్లాట్లకు 15 శాతం రాయితీ ఇస్తామని పేర్కొంది. దీని వల్ల భూమి రేట్లు తగ్గి చాలామంది డెవలపర్లు, కొనుగోలుదారులకు లబ్ధి కలుగుతుందని రాజస్థాన్ క్రెడాయ్ సెక్రటరీ రాజేంద్ర సింగ్ పచార్ పేర్కొన్నారు. అలాగే కొత్తగా బడ్జెట్ లో స్టాంప్ డ్యూటీ ఆమ్నెస్టీ స్కీమ్ ప్రవేశపెట్టడాన్ని రాజస్థాన్ క్రెడాయ్ అధ్యక్షుడు ధీరేంద్ర మదన్ స్వాగతించారు. ఈ పథకం కింద స్టాంపు డ్యూటీపై 50 శాతం రాయితీతోపాటు వడ్డీ, జరిమానాలపై వంద శాతం రాయితీ లభిస్తుంది. ఈ పథకం 2022 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుంది.

This website uses cookies.