Categories: TOP STORIES

చైనా రియల్.. భారీ కుదేల్!

  • పతాక స్థాయిక చేరిన స్థిరాస్తి సంక్షోభం
  • అసంపూర్తిగా నిర్మాణాలు..
  • తగ్గిపోతున్న ఇళ్ల ధరలు
  • కంపెనీలు రుణాల ఎగవేత
  • రుణాలు చెల్లించని బయ్యర్లు

చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం పతాక స్థాయికి చేరింది. మధ్యలో ఆగిపోయిన నిర్మాణాలు, గృహ‌రుణాల చెల్లింపుల నిలిపివేతతో ఆ దేశ రియల్ రంగం ప్రమాదంలో పడింది. పుచ్చకాయలకు, వెల్లుల్లిపాయలకు కూడా ఇళ్లు ఇస్తున్నారంటే అక్కడి పరిస్థితి ఎంత అధ్వాన్నంగా త‌యారైందో అర్థం చేసుకోవ‌చ్చు. ప్రాపర్టీ కంపెనీలను నియంత్రించాలన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ వైఖరే ఈ దుస్థితికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. చైనా జీడీపీలో నాలుగో వంతు రియల్ ఎస్టేట్ రంగం నుంచే వస్తున్న నేపథ్యంలో ఈ సంక్షోభం డ్రాగన్ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది.

కరోనాతో పాటు పలు కారణాలతో చైనా రియల్ రంగం ఒడుదొడుకులకు లోనైంది. ఫలితంగా ఇళ్ల ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత నెలలో ఏకంగా 10 నెలల కనిష్టానికి వాటి ధరలు తగ్గిపోయాయి. దీంతో కొనుగోలుదారులు ఇళ్లు కొనాలా వద్దా అనే సందిగ్ధంలో ఉండగా.. ఇప్పటికే కొత్త ఇళ్లు కొనుగోలు చేసినవారు డబ్బులు చెల్లించడానికి ముందుకు రావడంలేదు. నిర్మాణం పూర్తి కాని లేదా ఆగిపోయిన హౌసింగ్ ప్రాజెక్టులకు డబ్బులు కట్టేందుకు చాలామంది అంగీకరించడం లేదు. చివరకు మార్టిగేజ్ చెల్లింపులు కూడా నిలిపివేశారు. మరోవైపు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కంపెనీల వద్ద కూడా డబ్బులు ఉండటం లేదు. దీంతో అవి భారీగా బ్యాంకు రుణాల ఎగవేతకు పాల్పడుతున్నాయి. ఫలితంగా చైనా రియల్ రంగం దారుణ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

నిజానికి ఈ రంగానికి ఇచ్చే రుణాల మొత్తం కూడా తగ్గుతూ వస్తోంది. ఫలితంగా ప్రాజెక్టులు ఆగిపోవడం.. నిర్మాణాల్లో తగ్గుదల కనిపించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో గతేడాది సెప్టెంబర్ నుంచి ఇళ్ల ధరల్లో పతనం ప్రారంభమైంది. ముందుగానే చెల్లింపులు చేసిన కొనుగోలుదారులు నష్టపోయే పరిస్థితి వచ్చింది. కొత్తగా కొనుగోలుదారులు ఎవరూ ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలో పుచ్చకాయాలు, వెల్లుల్లిపాయలు, ఇతర ఆహార ఉత్పత్తులకు బదులుగా ఇళ్లను ఇవ్వడం ప్రారంభమైంది. కిలో పుచ్చకాయలకు 20 యువాన్ల ధర కట్టి.. ఆ మేరకు ఇళ్ల విక్రయాలు జరిగాయి. అయినప్పటికీ ఇదేమీ అంతగా ఫలితం ఇవ్వలేదు. ఏకంగా 25 శాతం విక్రయాలు ఒక్కసారిగా పడిపోయాయి. పరిస్థితులు ఇలా కొనసాగుతుండటంతో రుణాల ఎగవేతలు కూడా పెరుగుతున్నాయి.

ఇప్పటికే చైనా ప్రాపర్టీ దిగ్గజం ఎవర్ గ్రాండే తన అప్పులు చెల్లించలేక డీఫాల్ట్ కాగా.. తాజాగా షాంఘైకి చెందిన షిమోగ్రూప్ బిలియన్ డాలర్ల వడ్డీ, అసలు చెల్లింపులను ఎగవేసింది. చైనాలో అతిపెద్ద రుణ ఎగవేతల్లో ఇది ఒకటని చెబుతున్నారు. ఇదే సమయంలో చైనాలోని 22 నగరాల్లో గృహాలు కొనుగోలు చేసినవారు అసంపూర్తిగా ఉన్న ఇళ్లపై తనఖా చెల్లింపులను చేయడానికి నిరాకరిస్తున్నారు. రియల్టీ కంపెనీలు రుణాలు చెల్లించకుండా, నిర్మాణాలు పూర్తి చేయకుండా ఉండటం.. ఇళ్లు కొనేందుకు అడ్వాన్సులు చెల్లించిన వారిపై గృహరుణాల చెల్లింపు భారం పడుతోంది. మరోవైపు ఇళ్ల ధరలు కూడా తగ్గుతుండటంతో తాము మార్టగేజ్ చెల్లింపులు చేసేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. దీనివల్ల బ్యాంకులకు డీఫాల్టులు భారీగా పెరుగుతున్నాయి. చైనాల్ రియల్ పరిస్థితి మరింత ఘోరంగా ఉండనుంద‌ని.. భవిష్యత్తులో రుణ ఎగవేతలు ఇంకా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాదాపు 6 లక్షల కోట్ల డాలర్ల విలువైన రుణాల పరిస్థితి ప్రమాదంలో ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఎందుకిలా..

చైనా అభివృద్ధిలో రియల్ రంగం పాత్ర చాలా కీలకం. ప్రజల సంపదలో దాదాపు 70 శాతం మేర ఈ రంగంలోనే ఉన్నాయి. జిన్ పింగ్ పగ్గాలు చేపట్టిన తర్వాత రియల్ రంగం బాగా ఊపందుకుంది. గత 15 ఏళ్లలో ఏకంగా 600 శాతం మేర పెరిగింది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందనే అంచనాలు విపరీతంగా వ్యాప్తి చెందడంతో రియల్ ఎస్టేట్ సంస్థలు అంతర్జాతీయ బాండ్లు జారీ చేయడం ప్రారంభించాయి. నిధుల కోసం అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆశ్రయించడం మొదలుపెట్టాయి. ఇది తమ దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమని భావించిన చైనా.. నిబంధనలు కఠినతరం చేశారు.

ప్రాపర్టీ కంపెనీలను నియంత్రించాలన్న జిన్ పింగ్ ఆదేశాలు పలు చర్యలు చేపట్టారు. మరోవైపు కోవిడ్ వ్యాప్తి సైతం రియల్ కుదేలు కావడానికి కారణమైంది. ఈ నేపథ్యంలో చైనా నాయకత్వం రంగంలోకి దిగి పరిస్థితుల దిద్దుబాటుపై దృష్టి సారించింది. ఈ మేరకు చైనా బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ కమిషన్ (సీబీఐఆర్సీ) చర్యలు చేపట్టింది. డెవలపర్ల అవసరాల మేరకు రుణాలు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. అలాగే ప్రస్తుత రుణాల చెల్లింపు వ్యవధిని పొడిగించాలని పేర్కొంది. మార్టగేజ్ చెల్లింపులను కొద్దికాలం పాటు వాయిదా వేయడం ద్వారా గృహ కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించడం, నిలిచిపోయిన నిర్మాణాలను కొనుగోలు చేయడానికి స్థానిక ప్రభుత్వాలకు అనుమతి ఇవ్వడం వంటి అంశాలపైనా చైనా అధికారులు దృష్టి పెట్టారు.

This website uses cookies.