Categories: TOP STORIES

మన రంగానికి మళ్లీ కష్టాలు!

యావత్ భారతదేశంలోనే నెంబర్ వన్ అయిన హైదరాబాద్ నిర్మాణ రంగానికి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తున్నా.. డెవలపర్లు శ్రమిస్తున్నా.. కథ మొదటికొస్తుంది. కరోనా మహమ్మారి అర్థాంతరంగా మనుష్యుల ప్రాణాల్ని తీస్తుండటంతో.. కొత్తగా కొనేవాళ్లు లేరు.. కొన్నవాళ్లను పేమెంట్లు అడిగే పరిస్థితి లేదు.. నిర్మాణాల్ని వేగవంతం చేద్దామంటే పొరుగు రాష్ట్రాల కార్మికులు స్వరాష్ట్రాలకు పరుగెడుతున్నారు. కనీసం జూన్ లోపు ప్రభుత్వాలు వ్యూహాత్మక నిర్ణయాల్ని తీసుకుని.. కరోనాను నియంత్రించకపోతే ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుంది.

ప్రతికూల పరిస్థితులు.

– ఎస్ రాంరెడ్డి, సీఎండీ, ఎస్ఎంఆర్ హోల్డింగ్స్.

కరోనా సెకండ్ వేవ్లో మరణాల సంఖ్య పెరుగుతోంది. ప్రతిరోజు ఏదో ఒక మరణవార్త వినాల్సి వస్తోంది. ఈ భయానక వాతావరణంలో ఇల్లు కొనాలని భావించేవారూ.. గడప దాటి బయటికి రావట్లేదు. ఇప్పటికే ఇల్లు కొన్నవారిలో.. ఎవరో ఒకరు కరోనా బారిన పడటం.. లేదా వారి కుటుంబ సభ్యులు మరణించడం వల్ల నిర్మాణ సంస్థలకు చెల్లింపుల్ని జరపడం లేదు. బ్యాంకుల్లో సిబ్బంది లేకపోవడంతో రుణాలు సకాలంలో మంజూరు కావట్లేదు. తొంభై శాతానికి పైగా ప్రాజెక్టుల్లో ముప్పయ్ నుంచి యాభై శాతం కార్మికులే పని చేస్తున్నారు. ఇప్పటికైనా కరోనా అనుభవంతో.. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగం మీద కేటాయింపుల్ని పెంచాలి. ఈ విషయంలో మనం పాశ్చాత్య దేశాల్ని అనుసరించాల్సిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా గాంధీ ఆస్పత్రి వెళ్లడం వల్ల కరోనా రోగుల్లో ధైర్యం నిండింది. వారిలో భరోసా ఏర్పడింది. వరంగల్ ఎంజీఎంను సందర్శించడం సాహసోపేతమైన నిర్ణయం. దీంతో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలూ ఆస్పత్రుల్లో ఉన్న కరోనా రోగులకు ధైర్యం నింపే ప్రయత్నం చేస్తారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అందరూ వ్యాక్సీన్ వేసుకోవాలి. అతిత్వరలో మనం కరోనాను జయిస్తామన్న నమ్మకముంది.

ఆన్ లైన్ లో అమ్మకాలు..

– రాకేష్ రెడ్డి, డైరెక్టర్, అపర్ణా గ్రూప్

Aparna Constructions Director Mr. Rakesh Reddy

పండుగలు, ఎన్నికల కోసం సొంతూర్లకు వెళ్లిన భవన నిర్మాణ కార్మికులు ఏప్రిల్ మొదటి వారం దాకా మళ్లీ హైదరాబాద్ రావడం ఆరంభించారు. ఆతర్వాత కరోనా వల్ల లాక్ డౌన్ ఏర్పడటంతో వీరి రాక నిలిచిపోయింది. కాకపోతే, మేం ప్రత్యేకంగా రవాణా సదుపాయాల్ని ఏర్పాటు చేయడంతో.. గత వారం నుంచి.. ప్రతిరోజు 100 నుంచి 150 మంది భవన నిర్మాణ కార్మికులు వచ్చి మా ప్రాజెక్టుల్లో చేరుతున్నారు. కరోనా వల్ల కొనుగోలుదారుల ప్రాజెక్టుల సందర్శన నిలిచిపోయి.. చాలామంది ఆన్ లైన్లో ఇళ్లను కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ’అపర్ణా’ బ్రాండ్ మీద గల నమ్మకంతో ఈమధ్య ఇలా కొనేవారి సంఖ్య పెరుగుతోంది.

కార్మికులు ’క్యూ‘.. అమ్మకాల్లేవ్..

GOPALA KRISHNA- MD-hallmark developers

– గోపాల కృష్ణ, ఎండీ, హాల్ మార్క్ డెవలపర్స్

కరోనా సెకండ్ వేవ్ కారణంగా రియల్ రంగంలో మళ్లీ ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఏప్రిల్ లో పరిస్థితి కొంత ఫర్వాలేదనుకున్నాం. మే నెల వచ్చేసరికి ఒక్కసారి పరిస్థితి అడ్డం తిరిగింది. గతంతో పోల్చితే ప్రస్తుతం కరోనా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. ప్రతిరోజు ఏదో ఒక దుర్వార్త వినాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం జూన్ నెలలోపు కరోనాను నియంత్రించగలిగే విధంగా పటిష్ఠమైన చర్యల్ని తీసుకోవాలి. అప్పుడే హైదరాబాద్ రియల్ రంగం మెరుగవుతుంది. లేకపోతే దారుణంగా దెబ్బతింటుంది.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా భవన నిర్మాణ కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. బెంగాల్ ఎన్నికల తర్వాత కొందరు కార్మికులు మా సైటుకు విచ్చేశారు. కాకపోతే, కరోనా కారణంగా ఇందులో కొందరు మళ్లీ సొంతింటి గురించి ఆలోచించడం ఆరంభించారు. ఫలితంగా, యాభై శాతం కార్మికులు వెళ్లిపోయారు. మిగతా వారితోనే కొవిడ్ నిబంధలన్నీ పక్కాగా పాటిస్తూ పనుల్ని జరిపిస్తున్నాం. వారంతా కేవలం భయంతోనే వెళ్లిపోతున్నారని అర్థమైంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సొంతూర్లో ఉండటమే మేలని భావిస్తున్నారు. అందుకే, తామెంత భరోసా కల్పించినా ఏమాత్రం ఉండటానికి కొందరు ఇష్టపడటం లేదు. అయితే, మరికొంతమందేమో.. కరోనా వచ్చినా తమకేం కాదనే ధైర్యంతో ఇక్కడే పని చేస్తున్నారు. వీరికి అవసరమయ్యే సహాయ సహకారాల్ని అందిస్తున్నాం.

ప్రస్తుత పరిస్థితుల్లో మన రియల్ రంగంలో ఎంక్వయిరీలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గత నెల వరకూ తమ విల్లా ప్రాజెక్టును ప్రతిరోజు పది మంది దాకా సందర్శించేవారు. మా విల్లా లొకేషన్, డిజైన్ చూసి సంతోషించేవారు. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. కరోనా మరణాల సంఖ్యను చూసి.. అసలు ఇంటి గడప దాటి ఎవరూ బయటికి రావట్లేదు. స్వీయ లాక్ డౌన్ పాటిస్తున్నారు. అయితే, మేం ఉస్మాన్ నగర్ లో కడుతున్న హై ఎండ్ విల్లా కమ్యూనిటీలో ఇప్పటికే 90 శాతం విల్లాలు అమ్ముడయ్యాయి. కొనుగోలుదారులకు సకాలంలో విల్లాల్ని అందించాలనే ఉద్దేశ్యంతో నిర్మాణ పనుల్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నాం.

This website uses cookies.