పెట్టుబడుల ఆకర్షణలో మన రియల్ రంగం అదరగొట్టింది. ఈ ఏడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికం(క్యూ3)లో సంస్థాగత ఇన్వెస్టర్లు దాదాపు 1.15 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 9,600 కోట్లు) పెట్టుబడులు పెట్టారు. గతేడాది ఇదే సమయంలో 79.34 కోట్ల డాలర్ల(రూ. 6,625 కోట్లు) పెట్టుబడులు రాగా, ఈ సారి 45 శాతం అధికంగా పెట్టుబడులు వచ్చాయని కొలియర్స్ ఇండియా వెల్లడించింది. ఖరీదైన గృహాలు, కార్యాలయాలకు నెలకొన్న పటిష్ట డిమాండ్‌ను సొమ్ము చేసుకునే యోచనతో సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టారని పేర్కొంది.
విభాగాలవారీగా చూస్తే.. ఈ ఏడాది క్యూ3లో ఆఫీసు రంగం అత్యధికంగా 61.63 కోట్ల డాలర్లు(రూ. 5,150 కోట్లు) అందుకుంది. గత క్యూ3లో నమోదైన 7.91 కోట్ల డాలర్లతో పోలిస్తే ఇది ఏడు రెట్లు ఎక్కువ. రెసిడెన్షియల్ విభాగంలోనూ 40 శాతం అధికంగా 38.48 కోట్ల డాలర్లు(రూ. 3,215 కోట్లు) పెట్టుబడులు వచ్చాయి. గతేడాది మూడో త్రైమాసికంలో రెసిడెన్షియల్ రంగంలో 27.46 కోట్ల డాలర్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. అయితే ఇండస్ట్రియల్, వేర్‌హౌసింగ్ విభాగంలో పెట్టుబడులు ఏకంగా 72 శాతం తగ్గి, 9.52 కోట్ల డాలర్ల(రూ. 795 కోట్లు)కు పరిమితమయ్యాయి. గతేడాది క్యూ3లో 34.03 కోట్ల డాలర్ల(రూ. 2,840 కోట్లు) పెట్టుబడులు వచ్చాయి.
మిక్స్ డ్ వినియోగ ప్రాజెక్టులకు మాత్రం పెట్టుబడులు రెట్టింపై 5.24 కోట్ల డాలర్ల(రూ. 438 కోట్లు)ను తాకాయి. గతేడాది క్యూ3లో 2.72 కోట్ల డాలర్లు మాత్రమే వచ్చాయి. డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్, సీనియర్ హౌసింగ్, హాలిడే హోమ్స్, స్టూడెంట్ హౌసింగ్, స్కూల్స్ తదితర ప్రత్యామ్నాయ ఆస్తులలో ఎలాంటి పెట్టుబడులూ రాలేదు. గతేడాది క్యూ3లో వీటికి 7.22 కోట్ల డాలర్ల పెట్టుబడులు లభించాయి. రియల్టీ రంగ మొత్తం పెట్టుబడుల్లో దేశీ పెట్టుబడుల వాటా 44 శాతం(0.5 బిలియన్ డాలర్లు)గా నమోదైంది. దేశీ రియల్టీ రంగంలో సంస్థాగత పెట్టుబడులు నిలకడగా కొనసాగుతుండటం పెట్టుబడిదారుల విశ్వాసానికి నిదర్శనమని కొలియర్స్ ఇండియా క్యాపిటల్ మార్కెట్స్ ఎండీ పీయూష్ గుప్తా పేర్కొన్నారు.
This website uses cookies.