- వ్యవసాయ భూములు తీసుకుని అక్రమ వెంచర్లు
- అనుమతులు ఉన్నాయంటూ బురిడీ కొట్టిస్తున్న రియల్టర్లు
- ప్లాట్లు అంటగట్టాక ముఖం చాటేస్తున్న వైనం
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో రియల్ మాయకు సంబంధించిన ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. మధ్యతరగతి ప్రజల సొంతింటి కల ఆకాంక్షను అవకాశంగా మార్చుకుని పలువురు రియల్టర్లు మోసాలకు పాల్పడుతున్నారు. సకల సదుపాయాలతో భారీ వెంచర్.. యాదాద్రి ఆలయానికి అతి సమీపంలోనూ ప్లాట్లు అంటూ పెద్ద పెద్ద ప్రకటనలు గుప్పించి కొనుగోలుదారులను బట్టలో పడేస్తున్నారు. ఒక్కసారి ప్లాట్ అంటగట్టిన తర్వాత ముఖం చాటేస్తున్నారు. యాదాద్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు అధికమయ్యాయి.
యాదాద్రి పునర్నిర్మాణంతో ఆ ప్రాంతంలో భూముల ధరలు ఒక్కసారిగా మారిపోయింది. యాదాద్రి చుట్టపక్కల ప్రాంతాల్లో భారీగా వెంచర్లు వెలిశాయి. గ్రామాల్లో వ్యవసాయ భూములు తీసుకుని పంచాయతీల అనుమతులతో పెద్ద పెద్ద వెంచర్లు వేశారు. హెచ్ ఎండీఏ, వైటీడీఏ అనుమతులు ఉన్నాయని చెప్పి గజాల్లో ప్లాట్లను అమ్మేశారు. అనంతరం వాటికి అనుమతులు లేవని తెలిసి కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. యాదాద్రి, భువనగిరి నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 250కి పైగా వెంచర్లు ఉన్నాయని, వీటిలో చాలావాటికి సరైన అనుమతులు లేవనే అంటున్నారు. ల్యాండ్ కన్వర్వేషన్ వంటివి చేయకుండానే వెంచర్లు వేసి విక్రయాలు చేస్తున్నారని చెబుతున్నారు.
భువనగిరి సమీపంలో హరితవనం పేరుతో 12 ఏళ్ల క్రితం విఖ్యాత ఇన్ ఫ్రా డెవలపర్స్ భారీ వెంచర్ వేసింది. బీఎన్ తిమ్మాపూర్, బస్వాపూర్ గ్రామాల పరిధిలో దాదాపు వెయ్యి ఎకరాల్లో ఈ వెంచర్ ఉంది. అయితే, బస్వాపూర్ రిజర్వాయర్ లో ఈ వెంచర్ ముంపు బారిన పడింది. ఈ వెంచర్ కు అనుమతులు లేకపోవడంతో ప్రభుత్వం ఎకరాల చొప్పునే నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పింది. తమకు అరచేతిలో స్వర్గం చూపించి ఈ ప్లాట్లను అంటగట్టారని, ఇక్కడ రిజర్వాయర్ లో ఈ భూములు మునిగిపోతాయనే విషయం దాచిపెట్టి తమను నిలువునా మోసం చేశారని వాపోతున్నారు. ఒక ఫ్లాట్ రూ.2.50 లక్షలు పెట్టి కొన్నామని, ఇప్పుడు ప్రభుత్వం నుంచి అందులో సగం మొత్తం కూడా రావడం లేదని చెబుతున్నారు. చదరపు గజానికి రూ.10వేల చొప్పున పరిహారం చెల్లించాలని కోరుతున్నారు.
* హరితవనం ఒక్కటే కాకుండా ఇలాంటి వెంచర్లు చాలానే ఉన్నాయని, కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని బాధితులు సూచిస్తున్నారు. ఆలేరు మండలం మందనపల్లి సమీపంలోనూ విఖ్యాత ఇన్ ఫ్రా 30 ఎకరాల్లో వెంచర్ వేసి, పలువురిని బలి చేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడ మెడికల్ కాలేజీ వస్తుందని చెప్పి అక్రమ ప్లాట్లు విక్రయించారని బాధితులు వాపోతున్నారు. ఇలాంటి అక్రమ వెంచర్ల విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ఏది సక్రమ ప్రాజెక్టు? ఏది కాదు అనే విషయాల్ని ప్రజలకు తెలియజేయాలని కోరుతున్నారు.