- వడ్డీలూ గిట్టుబాటు కాని పరిస్థితి
- మూడేళ్ల నుంచీ ఇదే దుస్థితి
- ఎఫ్ఎస్ఐపై నియంత్రణ విధించాలి
- నరెడ్కో వెస్ట్ జోన్స్ బిల్డర్ల సంఘం ఆవేదన
హైదరాబాద్‌లోని నరెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్ల సంఘంలో చిన్న, మధ్యతరహా డెవలపర్లే ఎక్కువగా ఉన్నారు. వీరే నగరంలో అందుబాటు గృహాల్ని కట్టేవారిలో ముందంజలో ఉంటారు. దురదృష్టం ఏమిటంటే.. గత రెండు, మూడేళ్ల నుంచి ఈ బిల్డర్లు పెట్టిన పెట్టుబడికి ఎలాంటి ఆదాయమూ రావట్లేదు. కనీసం వడ్డీ కూడా గిట్టుబాటు కాని దుస్థితి. అయినా కూడా అపార్టుమెంట్లను నిర్మిస్తూ.. ప్రభుత్వానికి అనేక రకాల పన్నుల్ని చెల్లిస్తున్నారు. ఒకవైపు మధ్యతరగతి ప్రజానీకానికి సొంతింటి కలను సాకారం చేస్తూ మరోవైపు రాష్ట్రానికి పన్నులు, సెస్సులు, రుసుముల రూపంలో ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నారు.
కరోనా కారణంగా గత రెండేళ్లలో అమ్మకాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. నిర్మాణ వ్యయం పెరిగింది. కార్మికుల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రతి వస్తువు ధర విపరీతంగా అధికమైంది. అందుకే, తాము ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాల్ని చూపెట్టాలని కోరుతూ నరెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి ఓ వినతి పత్రాన్ని అందజేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి ఎం.ప్రేమ్ కుమార్.. జీహెచ్ఎంసీ కమిషనర్,
చీఫ్ సిటీ ప్లానర్ తదితరులు ఓ వినతి పత్రం అందజేశారు. ఆ వినతి పత్రం సారాంశం ఇలా ఉంది.
- హైరైజ్ సెట్ బ్యాకులను పాటించాలనే నిబంధనను తొలగిస్తూ.. అగ్నిమాపక విభాగం నుంచి ఎన్వోసీకి మినహాయింపునిస్తూ.. 21 మీటర్ల ఎత్తు దాకా భవనాలకు టీడీఆర్‌ను అనుమతించాలి.
- స్టిల్ట్‌తో పాటు ఐదు అంతస్తులు దాటిన కట్టడాలకు టీడీఆర్‌లను అనుమతినివ్వాలి.
- ఎకరాకు ఎఫ్ఎస్ఐని 1.75 లక్షల చదరపు అడుగుల వరకే పరిమితం చేయాలి. రోడ్డు వెడల్పును బట్టి 18 అంతస్తుల దాకా అనుమతిని మంజూరు చేయాలి. ఆతర్వాత టీడీఆర్‌ను అనుమతించాలి.
- ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ మంజూరైన ఆరు నెలలయ్యాక ప్రాపర్టీ ట్యాక్స్‌ను వసూలు చేయాలి.