హైదరాబాద్ రియల్ మార్కెట్ కు జూన్ నెల అంత కలసి రాలేనట్టుంది. మే నెలతో పోలిస్తే జూన్ లో స్థిరాస్తి విక్రయాలు, రిజిస్ట్రేషన్లు తగ్గడమే ఇందుకు నిదర్శనం. మే నెలలో రూ.2,994 కోట్ల విలువ చేసే 5,877 అపార్ట్ మెంట్లకు రిజిస్ట్రేషన్లు జరగ్గా.. జూన్ లో రూ.2,898 కోట్ల విలువైన 5,566 యూనిట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ అయినట్టు నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. గతేడాది జూన్ లో 5,411 రిజిస్ట్రేషన్లు జరగ్గా.. ఈ ఏడాది జూన్ లో స్వల్పంగా 3 శాతం మాత్రమే పెరిగాయి.
ఇక రిజిస్ట్రేషన్లలో మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా అత్యధికంగా 46 వాటా కలిగి ఉండగా.. రంగారెడ్డి 38 శాతం, హైదరాబాద్ 16 శాతం వాటాతో ఉన్నాయి. ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేకపోవడం.. తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఇప్పుడే అంచనా వేయలేకపోవడం వంటి అంశాలు స్థిరాస్తి విక్రయాల్లో క్షీణతకు కారణాలని చెబుతున్నారు.