ఇటీవల కాలంలో పెరిగిన నిర్మాణ సామగ్రి ధరలు తగ్గించే దిశగా కేంద్రం చర్యలు చేపట్టినట్టు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయమంత్రి కౌశల్ కిశోర్ రాజ్యసభకు తెలిపారు. 2021-22, 2022-23 కేంద్ర బడ్జెట్లలో నాన్ అలాయ్, అలాయ్, స్టెయిన్ లెస్ స్టీల్ పై కస్టమ్స్ డ్యూటీని 7.5 శాతం చొప్పున తగ్గించినట్టు వివరించారు. అలాగే ఐరన్ ఓర్, ఐరన్ ఓర్ పెల్లెట్స్ పై ఎగుమతి సుంకాన్ని వరుసగా 50 శాతం, 45 శాతం పెంచినట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా పిగ్ ఐరన్, మరికొన్ని స్టీల్ ఉత్పత్తులపై ఎగుమతి సుంకాన్ని 15 శాతం పెంచినట్టు చెప్పారు. ఇదే కాకుండా 8ఎంఎం కంటే తక్కువ మందం కలిగిన టీఎంటీ బార్లను క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ నుంచి తప్పించారు. వీటిని కీలకమైన అంశాల్లో కాకుండా చాలా సాధారణమైన అంశాల్లో మాత్రమే వినియోగిస్తారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటితోపాటు ఐరన్, స్టీల్ వంటి వాటి లభ్యతను పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంది. అలాగే నిర్మాణంలో ఉన్న అందుబాటు ధరలోని హౌసింగ్ ప్రాజెక్టులపై జీఎస్టీని 8 శాతం నుంచి ఒక శాతానికి తగ్గించింది. అదే ఇతర ప్రాజెక్టుల జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి కుదించింది. ఈ నేపథ్యంలో స్టీల్ ధరలు తగ్గడంతోపాటు జీఎస్టీ కూడా తగ్గడంతో నిర్మాణ వ్యయం తగ్గింది. మరి ఈ మేరకు ఫ్లాట్ల ధరలు కూడా తగ్గుతాయా లేదా అనే అంశం చర్చనీయాంశమైంది.
This website uses cookies.