దేశంలోనే అతి పిన్న రాష్ట్రమైన తెలంగాణ గత ఎనిమిదేళ్లలో అనేక సంస్కరణల్ని చేపట్టింది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. రైతు బంధు, రైతుబీమా, టీఎస్ ఐపాస్, టీఎస్ బీపాస్ వంటి ఆకర్షణీయమైన పథకాలకు శ్రీకారం చుట్టి.. రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ అడుగు జాడల్లో నడిచేలా చేసింది. ఇంత ఘనమైన ట్రాక్ రికార్డు గల మన ప్రభుత్వం.. స్టాంప్ డ్యూటీ విషయంలోనూ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంటుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కానీ, అటు ప్రజలు ఇటు రియల్టర్ల ఆశల్ని వమ్ము చేస్తూ ఒకటిన్నర శాతం పెంచేసింది. సంస్కరణల్ని అమలు చేస్తోన్న క్రమంలో స్టాంప్ డ్యూటీని తగ్గించే యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఎదురు చూస్తే.. సామాన్యుల నడ్డి విరిగేలా నిర్ణయించడం సామాన్యులకు, మధ్యతరగతి ప్రజానీకానికి మింగుడు పడటం లేదు. అందుకే, మెజార్టీ ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయని భావించి.. చాలామంది సామాన్యులు, మధ్యతరగతి ప్రజానీకం.. వడ్డీకి సొమ్ము తెచ్చి మరీ రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి ముందుకొచ్చారు. కరోనా సమయంలో చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు.. జీతాలు రావడం లేదు.. వ్యాపారాల్లేవు.. ఇలాంటి తరుణంలో హఠాత్తుగా స్టాంప్ డ్యూటీని పెంచడం పట్ల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశాన్ని గమనించే..
కరోనా సమయంలో మహారాష్ట్ర రెండు శాతం స్టాంప్ డ్యూటీ తగ్గించింది. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ప్రభుత్వాలు స్టాంప్ డ్యూటీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతెందుకు, నిన్నగాక మొన్న కర్ణాటక ప్రభుత్వం రూ.45 లక్షల్లోపు ఇళ్లపై స్టాంప్ డ్యూటీని తగ్గించింది. కరోనా వల్ల దెబ్బతిన్న నిర్మాణ రంగాన్ని ఆదుకునేందుకు ఇతర ప్రభుత్వాలన్నీ స్టాంప్ డ్యూటీని తగ్గిస్తుంటే.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. షేర్ మార్కెట్, బంగారం మీద ఎలాంటి రుసుముల్ని వసూలు చేయని ప్రభుత్వాలు.. సామాన్యుడికి అతిపెద్ద భరోసా కలిగించే ప్లాటును కొంటే ఎందుకు ఇంతింత స్టాంప్ డ్యూటీని వసూలు చేస్తున్నారు? ప్రజలు ఒక ఆస్తిని కొన్ననప్పుడు అందుకు సంబంధించిన పేరు, వివరాలకు సంబంధించిన రికార్డులను నమోదు చేయడానికే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఈ తరహా సేవల్ని ప్రభుత్వం ప్రజలకు నామమాత్రంగా అందజేయాలి తప్ప.. రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఆదాయాన్ని ఆశించొద్దు. వైఎస్పార్, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయంలో క్రమం తప్పకుండా ఇష్టం వచ్చినట్లుగా స్టాంప్ డ్యూటీలను సవరించేవారు. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేనప్పటికీ.. కరోనా సమయంలో రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచడం సమంజసం కాదని రియల్ రంగం భావిస్తోంది.
కరోనా సమయంలో కరెక్టు కాదు..
వాస్తవానికి, రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అనేక సంస్కరణలకు పెట్టింది పేరు. ఈ పోకడకు విరుద్ధంగా ఒకేసారి మార్కెట్ విలువల్ని పెంచడం.. స్టాంప్ డ్యూటీని పెంచడం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపించినట్లు అయ్యింది. సంస్కరణల్ని అమలు చేసే క్రమంలో శాస్ట్రీయ పద్ధతిలో భూముల విలువల్ని హేతుబద్ధీకరించాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే, కరోనా విపత్కర సమయంలో.. మహారాష్ట్ర ప్రభుత్వం తరహాలో స్టాంప్ డ్యూటీని తగ్గిస్తే అనేక మంది ముందుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునేవారు. కాకపోతే, ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. ఫలితంగా, ఇతర రాష్ట్రాలకు మనకు పెద్దగా తేడా లేకుండా అయ్యింది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించాలి.- గుమ్మి రాంరెడ్డి, ఉపాధ్యక్షుడు, క్రెడాయ్ నేషనల్
ప్లాట్లు కొనేలా ప్రోత్సహించాలి
షేర్ మార్కెట్లో కొంటే లాభాలొస్తాయనే భరోసా లేదు. బంగారం కొంటే ఎక్కడ భద్రపర్చుకోవాలో తెలియదు. అందుకే, సామాన్యులు భూముల్లో పెట్టుబడి పెడితే ఓ భరోసా కలుగుతుంది. తాను కొన్న ఆస్తి కళ్ల ముందే కనిపిస్తే సంతోషం కలుగుతుంది. అలాంటి సంతోషాన్ని నోచుకోకుండా చేసే విధంగా స్టాంప్ డ్యూటీని రాష్ట్ర ప్రభుత్వం పెంచేసింది. సెక్యూర్డ్ ఇన్వెస్ట్ మెంట్ ని సామాన్యులకు అందకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచడం కరెక్టు కాదు. జీఎస్టీ తరహా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇక్కడ లభిస్తుందా అంటే అదీ లేదు. ఎన్ని సార్లు చేతులు మారితే అన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. దానం రిజిస్టర్ చేయాలంటే నాలుగు వందల శాతం ఎక్కువ స్టాంప్ డ్యూటీ కట్టమంటున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ కి గిఫ్టు ఇస్తే రెట్టింపు చేశారు. సెటిల్మెంట్ కి పెంచేశారు. స్టాంప్ డ్యూటీ ముప్పయ్ శాతం పెంచేశారు. అసలెందుకింత శాతం పెంచుతున్నారు? షేర్ మార్కెట్లో షేరు కొంటే కానీ బంగారం కొంటే కానీ ఇంతింత రుసుములు కడతామా? సామాన్యులు ప్లాట్లు కొనకుండా అడ్డుకట్ట వేస్తామా? అందుకే, వీరికి భరోసా కలిగించేలా నిర్ణయం తీసుకోవాలి. మార్కెట్ విలువల్ని హేతుబద్ధీకరించాల్సిందే. పెంచినవి ఉంటే సవరించాలి. దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అందుకే, రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఇప్పటికైనా రివర్స్ చేయాలి. – ఆర్ చలపతిరావు, అధ్యక్షుడు, ట్రెడా